మహిమలయాన్వితుడు – సాదాసీదా శ్రీ శార్వరి : డాక్టర్ రమణ వి.వాసిలి
చెన్నైలో మద్రాస్ విశ్వవిద్యాలయంది 99 సంవత్సరాలు చరిత్ర. అటువంటి చారిత్రక విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ వుండటం తెలుగు వారికి ఎంతో గర్వకారణం. ఆచార్య విస్తాలి శంకరరావు తెలుగుశాఖాధ్యక్షులుగా పాఠ్యాంశాలు, పరిశోధనలే కాకుండా తరచూ జాతీయ, అంతర్జాతీయ సాహితీ సదస్సులు నిర్వహించడం ఎంతో ముదావహం. మధురై కామరాజు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య జొన్నలగడ్డ వెంకట రమణ ఇటీవల “విశ్వర్షి వాసిలి వసంతకుమార్ వాజ్మయం – దృక్పథాలు” శీర్షికన అంతర్జాతీయ సదస్సు నిర్వహించి తెలుగు భాష పట్ల వున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఆచార్య శంకర రావు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు “మాస్టర్ శార్వరి సాహిత్యం – సమాలోచన” అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో దాదాపు వంద మందికి పైగా సాహితీవేత్తలు పత్రాలను సమర్పించడమే కాకుండా స్వయంగా పాల్గొని శ్రీ శార్వరి రచించిన అరవింద సావిత్రి, ధ్యానం ఎలా చేయాలి, బ్రహ్మజిజ్ణాస, గురుగీత, మృత్యువు తర్వాతి జీవితం, ఇహం పరం మనం, కుండలిని, కృష్ణవతారం, మహాత్మా జీసస్, రమణ మహర్షి, అరవింద్ యోగి, గీతా రహస్యాలు, కర్ణ మహాభారతం, శంబళ, దాదా గవంద్, అతీతమానస జీవనం, మాడమ్ బ్లవట్స్కీ వంటి ఆధ్యాత్మిక రచనలు, చీకటి దేవతలు, వెన్నెల కెరటాలు, లయతప్పిన హృదయాలు, స్వీట్ హోమ్, వంటి సాంఘిక నవలలు, సామ్రాట్ అశోక్, ఎలిజబెత్ టేలర్ వంటి చారిత్రక నవలలు, అజంతా వంటి కవితా సంపుటాల మీద ప్రసంగించనున్నారు.

శ్రీ శార్వరి ఎవరు?
నా పేరు రమణ, శ్రీ శార్వరి గారి చిన్నబ్బాయిని.
వజ్రానికి ఎలా బహుముఖాలు వుంటాయో మా నాన్నగారు అంతే. అయినప్పటికీ సాదాసీదా మనిషే అంటాను. మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మా తాతయ్య గారికి కులవృత్తి తప్ప చదువు పట్ల పెద్ద ఆసక్తి లేదు. ఆ కారణంగా పరీక్షల ఫీజు కట్టడానికి డబ్బులులేక ఎం. ఏ. ఇంగ్లీష్ మధ్యలోనే ఆపేశారు. తెనాలి రైల్వే స్టేషన్లో పుణుగులు అమ్మడం, ప్రింటింగ్ ప్రెస్‌లలో పుస్తకాలు కట్టలు కట్టడం, ప్రూఫ్‌లు దిద్దడం, అడపాదడపా పత్రికల్లో కథలు, కవితలు రాసి పదిపరక సంపాదించడం ఇది పాతిక సంవత్సరాల శార్వరి. పెళ్ళయ్యేనాటికి కొన్ని రొమాంటిక్ నవలలు, మరికొన్ని చారిత్రక నవలలు నాన్నగారి ఖాతాలో ఉన్నాయి, వృత్తి రీత్యా ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్‌గా మొదలు పెట్టి అసిస్టెంట్ ఎడిటర్‌గా రిటైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
నలుగురు పిల్లలకు తండ్రైనప్పుడు బతుకు గాడితప్పినట్లు అన్పించడం, దాంతో గుండె జారడం సహజం. కాని నాన్నగారికి నిండుకుండలాంటి మనస్తత్వం. ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. చెన్నైలాంటి పట్టణంలో బతుకు పోరాటంలో అందని ద్రాక్ష పళ్ళకోసం ఏనాడూ అర్రులు చాచలేదు. ఉన్నంతలో సర్దుకు పోవడం, వున్నంతలోనే వున్నతంగా బతుకులనుకునే ఉన్నత వ్యక్తిత్వం అమ్మ, యామినీదేవి, నాన్నగార్లది. ఇప్పటి తరం పిల్లలకు ఆశ్చర్యం అనిపించొచ్చు కాని నిజం ఏంటంటే మా నాన్నగారితో కలిసి నేనెప్పుడూ హోటల్‌కి వెళ్ళిందిలేదు అలాగే సినిమా హాల్‌కి వెళ్లి సినిమా చూసింది లేదు.
ఉగ్రనరసింహుడు
సాధారణంగా నాన్నగారిని చూస్తే మెతకగా, మృదుస్వభావిగా, స్నేహశీలిగా కనిపిస్తారు. అవన్నీ నిజమయినప్నటికీ పిల్లల్ని సంరక్షించే విషయంలో ఆయన ఉగ్రనరసింహుడే. బహుశా నాకు ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక రోజు ఏదో కారణంగా మా అన్నయ్యని స్కూల్లో టీచర్ కర్రతో కొట్టడం జరిగింది. వీపు మీద అడ్డంగా వాత తేలింది. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన నాన్నగారికి ఈ విషయం తెలియడం నాలుగు ఇళ్ళ అవతల వున్న ఆ టీచర్‌కి ఉగ్రనరసింహస్వామి దర్శనం కావడం క్షణాల్లో జరిగిపోయింది. బహుశా ఈ సంఘటన తర్వాత మళ్లీ ఏ టీచర్ మా ఎవర్నీ దండించే ప్రయత్నం చేయలేదు. మరో సందర్భంలో చెన్నైలో మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి తాగిన మైకంలో నన్ను కొట్టాడు. అది తెలిసిన నాన్నగారు వాళ్ళింటి తలుపులు బద్దలు కొట్టి మరీ వెళ్లి అతన్ని కొట్టారు. కండలు లేకపోయినా మా నాన్నగారు కొండల్ని పిండి చేయగలరని అప్పుడే తెలిసింది. అమ్మ, నాన్నగారు మమ్మల్ని ఎంత ప్రేమించారో, అంతగా సంరక్షించారు, మరెంతగానో క్రమశిక్షణ నేర్పారు, అది తప్పినప్పుడు శిక్షించడానికి వెనకాడేవారు కాదు.
వ్యక్తిత్వం
చాలా మంది అంటుంటారు గొప్ప గొప్ప రచనలు చేయాలంటే ప్రశాంతమైన వాతావరణం కావాలని, లేదంటే అటు, కొడైకెనాల్ లాంటి సుందర ప్రాంతాలకు వెళ్లాలని. ఆంధ్రమహాసావిత్రి లాంటి పుస్తకం నాన్నగారు రాసింది నలుగురు చిన్నపిల్లలు వున్న ఇంట్లోనే అదీ వంద రూపాయలు ఖరీదు చేసే చెక్క టేబుల్ మీద. కొన్ని వందల ఆధ్యాత్మిక గ్రంథాలు రాసింది, మరి కొన్ని వందల మందితో ఆధ్యాత్మిక, యోగసంబంధిత విషయాలు చర్చించి, దిశానిర్దశం చేసింది పది అడుగులకన్నా చిన్నదైన ఒక రూములో, సాదాసీదా కుర్చీలో కూర్చుని.
నాన్నగారికి సాహిత్యం, ఆధ్యాత్మికత, మంత్రాలు, తంత్రాలు, యోగ పురుషులు, సిద్ధ పురుషులు ఆసక్తి, జిజ్ఞాస కలిగించే విషయాలు. భారతీయ సాహిత్యంలో ఆయన చదవని ఆధ్యాత్మిక గ్రంథం లేదంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికీ ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు మదాకా తెచ్చేవారు కాదు. అందుకే పిల్లలమైన వసంతకుమార్ తెలుగు సాహిత్యంలో పి. హెచ్డి చేయడమే కాకుండా మిక్కిలి మక్కువ పెంచుకుంటే, శ్యాంసుందర్ చార్టెడ్ అకౌంటెంట్‌గా, నేను రసాయన శాస్త్రంలో పి. హెచ్డి, మా చెల్లెలు పద్మప్రియ కామర్స్‌లో డిగ్రీ చేయగలిగాం. వ్యక్తిగతంగా మాకు నచ్చినట్లుగా మేము ఎదగాలన్నది, జీవించాలన్నది మా అమ్మనాన్నల అభిమతం.
ఏ కోరికలు లేనప్పుడు దేన్నైనా సాధించవచ్చు అన్నందుకు నిదర్శనం మా నాన్నగారు. ఆయనకు పేరు ప్రఖ్యాతులు మీద కోరికలేదు. రచయిత గానో, సంపాదకుడిగానో, లేదా యోగిగానో గుర్తింపు పొందాలనే తపనలేదు. ఉపన్యాసాలు ఇవ్వాలనో, తనకు ఎంత తెలుసో పదిమందికి చెప్పి నమ్మించాలనే పిపాసలేదు. చివరకు తను రాసే పుస్తకాలు సహితం అందరికీ పనికివచ్చేవి కావని నిర్మొహమాటంగా చెప్పగలిగే ఏ భేషజం లేని మనిషి.
రచనా వైశిష్ట్యం
కొందరి రచనల మీద సమీక్షలు రాయచ్చు. మరికొందరి రచనల మీద అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ నాన్నగారి రచనలు చదివినప్పుడు ఏమీ రాయడానికి, చెప్పటానికి వుండదు. ఎందుకంటే ఎవరికి వారు చదివి అర్థం చేసుకోవాల్సిందే. అర్ధమయిన వారికి అర్ధమయినంత. ఆయన ఒక మహానది లాంటి వారు. మనం ఏ పాత్ర తీసుకెళితే అంతే తెచ్పుకోగలం. మన ఔన్నత్యాన్ని బట్టి, చైతన్యాన్ని బట్టి ఆయన, ఆయన రచనలు అర్థం అవుతాయి.
యోగ వైశిష్ట్యం
శ్రీ శార్వరి అంటే ఎత్తైన హిమాలయాలు, దీటైన మేరు పర్వతం, పౌర్ణమినాటి నిండు చంద్రుడు, విరిసిన అరవిందాలు, తెల్లని హంసలు స్ఫురణకు వస్తాయి. మరోపక్క ఒక జీసస్, రమణ మహర్షి, అరవిందుడు, షిరిడి సాయిల ఆహార్యమూ, వ్యవహారమూ పుణికి పుచ్చుకున్న విగ్రహం మా నాన్నగారిది.
దాదాపు అయిదుపదులు మాస్టర్ సి.వి.వి. ఆవిష్కరించిన భృక్త రహిత తారక రాజయోగ విశిష్ట యోగ సాధనతో మా నాన్నగారు యోగీశ్వరులయ్యారు.
మాస్టార్ శార్వరి తొలిశ్వాస: 7 నవంబర్, 1929 పరశ్వాస: 12 డిసెంబర్, 2015.
ఇవి కూడా చదవండి

















