America : అమెరికాలో ఏపీ యువతి దుర్మరణం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి యువతి నాగశ్రీ వందన పరిమళ (Nagashri Vandana Parimala) (26) దుర్మరణం పాలైంది. సూరె గణేష్, రమాదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె నాగశ్రీ వందన పరిమళ. డేటా అనలటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసేందుకు 2022లో అమెరికా వెళ్లి, మెంఫిస్ యూనివర్సిటీ (University of Memphis) లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. సోమవారం జరిగే యూనివర్సిటీ కాన్వొకేషన్లో ఎంఎస్ పట్టా తీసుకుంటానన్న సంతోషంలో ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఎవరినో రిసీవ్ చేసుకునేందుకు స్నేహితులతో కలిసి కారులో బయలుదేరింది. అదే రోజు రాత్రి 2:30 గంటల సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై నిలిపి ఉండగా, వేగంగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరగడానికి అరగంట ముందే ఇంటికి ఫోను చేసి తల్లి రమాదేవితో మాట్లాడింది. తానా అధ్యక్షుడు బుచ్చయ్యచౌదరి(TANA President Butchaiah Chaudhary), సభ్యులు వాసు, కిరణ్ తదితరులు వందన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి మాట్లాడారు. వందన పరిమళ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా ఇండియా (India)కు తరలిలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.







