Hey Balwanth Review: నవ్వించే ‘హే బల్వంత్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ :2.5/5
నిర్మాణ సంస్థ : త్రిశుల్ విజనరీ స్టూడియోస్
నటీనటులు: సుహాస్, శివానీ నాగారం, నవరసరాయ నరేష్ విజయ్‌కృష్ణ, వెన్నెల కిషోర్,
యాంకర్ స్రవంతి చొక్కారపు, నెల్లూరు సుదర్శన్, అజయ్ ఘోష్, హర్షవర్దన్, అన్నపూర్ణమ్మ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, సినిమాటోగ్రఫి: మహీ రెడ్డీ పండుగుల
ఎఢిటింగ్: విప్లవ్ నైషాడ, కథ: షణ్ముఖ ప్రశాంత్, మాటలు : మిథున్ శంకర్ రెడ్డి
పంపిణి దారులు : బన్నీవాస్, వంశీ నందిపాటి, (నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్)
నిర్మాత: బీ నరేంద్రరెడ్డి, దర్శకత్వం: గోపి ఆచార
విడుదల తేది : 20.02.2026
నిడివి : 2 ఘంటల 15 నిముషాలు
‘లిటిల్‌హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్వంత్’ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ఈ రోజు థియేటర్లలో విడుదల చేసారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. రిలీజ్‌కి నాలుగు రోజుల ముందు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో ‘హే భగవాన్’ సినిమా కాస్తా ‘హే బలవంత్’గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టైటిల్ మార్పు అయినా సరే సినిమా అదే కదా? మరి సినిమా ఎలా వుందో సమీక్షలో చూద్దాం.

ఇవి కూడా చదవండి
కథ :
చిన్నతనం నుంచే తండ్రి బలవంత్ చేసే వ్యాపారాన్ని కృష్ణ (సుహాస్) చేపట్టాలని కలలు కంటాడు. కానీ తండ్రి రావ్ బలవంత్ (నరేష్) తన వ్యాపారానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు. కానీ కృష్ణ అదే కోరికతో పెద్ద పెరిగిన తర్వాత వారసత్వంగా వచ్చే వ్యాపారాన్ని చేపట్టాలని చదువును నిర్లక్ష్యం చేస్తుంటాడు. దాంస్తో కొడుకును బోర్డింగ్ స్కూల్లో చేర్పించి తన వ్యాపారానికి దూరంగా పెడుతాడు. కానీ పెద్ద పెరిగి ఎంబీఎ చేసిన తర్వాత తండ్రి బిజినెస్‌ను టేకోవర్ చేయాలనుకొంటాడు. అయితే ఊహించని విధంగా ఓ క్రిటికల్ కండిషన్లో వ్యాపారం కృష్ణ చేతికి వస్తుంది. తన తండ్రి చేస్తున్న బిజినెస్ చూసి షాక్ అవుతాడు. కృష్ణ తండ్రి చేసే బిజినెస్‌ను చూసి ప్రియురాలు మిత్ర (శివానీ నాగారం) అసహ్యించుకొని.. ఆ వ్యాపారం మానేస్తేనే పెళ్లికి సరే అంటుంది. దాంతో ఆ బిజినెస్‌ను అమ్మాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.బలవంత్ చేసే వ్యాపారం ఏమిటి? తండ్రి వ్యాపారాన్ని ఎందుకు చేపట్టాలని కలలు కంటాడు. తన వ్యాపారానికి కొడుకు కృష్ణను ఎందుకు దూరం పెట్టాడు? తండ్రి చేసే వ్యాపారాన్ని చూసి కృష్ణ ఎందుకు షాక్ తిన్నాడు? ప్రేమ, పెళ్లి విషయంలో ప్రియురాలు మిత్ర పెట్టిన కండిషన్స్ తర్వాత కృష్ణ పరిస్థితి ఏమిటి? తండ్రి బిజినెస్‌ను అమ్మాలని చేసిన ప్రయత్నాలు ఎలా సాగాయి? తండ్రి బిజినెస్‌ను అమ్మేసే ప్రయత్నంలో ఎదురైన కష్టాలు ఏమిటి? చివరకు తండ్రి బిజినెస్‌ను మాన్పించాడా? ప్రియురాలి ప్రేమను ఎలా గెలుచుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే హే బల్వంత్ సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
సంక్రాంతికి విడుదలై న నారి నారి నడుమ మురారి లో వీకే నరేష్ ఇరగదీసాడు. ఈ సినిమాలో కూడా టైటిల్ రోల్‌తో మ్యాజిక్ చేశాడు. తన పాత్రలో నటించారని చెప్పడం కంటే జీవించారని అనాలి. ఈ సినిమాకు వీకే నరేష్ మాత్రమే హీరో అనేంతగా పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ప్రతీ సినిమాకు ఆయన ఎంచుకొంటున్న పాత్రలు, చూపిస్తున్న వేరియేన్స్కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక సుహాస్ కూడా వీకే నరేష్‌తో పోటీ పడి నటించాడు. సినిమా కథల ఎంపిక కూడా బాగుంది. శివానీ నాగారం కూడా ఈ చిత్ర విజయానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్టీని తన నటనతో చూపించారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వస్తే.. భాషను, కథను అర్ధం చేసుకొని బాగా నటిస్తారనే విషయాన్ని మిత్ర క్యారెక్టర్ ద్వారా శివానీ తెలియజెప్పింది. ఇక ఈ సినిమాను తన కామెడీతో లైవ్లీగా మార్చడంలో వెన్నెల కిషోర్ రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ర్యాప్ ఫ్లేవర్‌తో సాగే క్యారెక్టర్ బాగా ఇంప్రూవ్ చేశాడు. హర్షవర్షన్, అజయ్ ఘోష్ గుర్తుండిపోయే పాత్రలు చేయడమే కాకుండా కామెడీతో అదరగొట్టారు. అలానే హర్షవర్థన్, సీనియర్ నటి అన్నపూర్ణ, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ ఇలా అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
ఈ కథని చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ మీద రాసుకున్నారు డైరెక్టర్. అయితే కథ ఎంత సెన్సిబుల్ అయినా కూడా అందులోనుంచి అంతే స్థాయిలో కామెడీని కూడా జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, కొన్ని అడల్ట్ రేటెడ్ కామెడీ పంచులు కూడా ఉంటాయ్ కనుక పెద్దవాళ్లని ఇబ్బంది పెట్టేంత తక్కువ స్థాయి కామెడీ ఏం సినిమాలో లేదు. సినిమా ఆద్యంతం కామెడీ ట్రాక్స్ అన్నీ పండించాడు. వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బీజీఎమ్ విషయంలో మాత్రం న్యాయం చేశారు. ఓవరాల్‌గా సినిమా అయితే ఎక్కడా నిరాశపరచలేదు. కానీ హీరో తండ్రి ఇలాంటి కాలంలో కూడా సమాజం ఒప్పుకోలేని ఒక వ్యాపారాన్ని ఎందుకు కొనసాగించాడనే ప్రశ్న మాత్రం ఆడియన్స్‌లో మిగిలిపోతుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత బీ నరేంద్రరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
ఫస్టాఫ్ మొత్తం సుహాస్‌కి తన ఫ్రెండ్ పాత్ర చేసిన కమెడియన్ సుదర్శన్ మధ్య జరిగిన సీన్లు థియేటర్లో గట్టిగానే నవ్వించాయి. ఫస్టాఫ్ పెద్దగా కామెడీ జోలికి వెళ్లకపోయినా సెకండాఫ్‌లో మాత్రం నరేష్ తనదైన టైమింగ్, నటనతో ఆడియన్స్‌ని నవ్వించారు.. అలానే కొన్ని సీన్లలో ఎమోషనల్ కూడా చేశారు. అయితే హీరోకి, తండ్రికి మధ్య సాగిన ఫాదర్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది కానీ సినిమా కథలో కోర్ పాయింట్ అయిన బలవంత్ బిజినెస్ మీద రాసుకున్న ట్రాక్ మాత్రం అంతగా ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వకపోవచ్చు. సుహాస్, సీనియర్ నరేశ్ నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.
ఇవి కూడా చదవండి






