D/O Prasad Rao Kanabadutaledu: ఫ్యామిలీ అంతా కలిసి చూసే ‘D/O ప్రసాద్ రావు కనబడుటలేదు’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : ZEE5
నటి నటులు : రాజీవ్ కనకాల, ఉదయభాను, స్వాతి, బి.హిమ బిందు, గాయత్రి భార్గవి, నాయుడు, తదితరులు నటించారు.
సంగీతం :శ్రీ రామ్, సినిమాటోగ్రఫీ: కే.మహేష్ కుమార్,
ఎడిటర్ :చంద్ర శేఖర్, సహా నిర్మాత: అంజయ్య,
నిర్మాత: కే.వి. శ్రీ రామ్,
కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పోలూరు కృష్ణ,
నిరంతర ప్రత్యక్ష ప్రసారం: ZEE5 లో 2026, ఫిబ్రవరి 27 వ తేది నుండి….
జీ5 సంస్థ నుండి వచ్చిన తాజా వెబ్ సిరీస్ “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు”.(D/O Prasada Rao Kanabaduta Ledu) ఇటివల తండ్రి పాత్రలకే పరిమితమైన రాజీవ్ కనకాల,(Rajeev Kanakala) వాసంతిక, చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఉదయభాను(Udaya Bhanu) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ కి “రెక్కీ” ఫేమ్ కృష్ణ పోలూరు దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఓ మోస్తరు ఆసక్తి నెలకొల్పింది. 6 ఎపిసోడ్ల ఈ సిరీస్ ఏమేరకు ఆకట్టుకుంది? కృష్ణ మళ్లీ రెక్కీ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగారా లేదా అనేది సమీక్షలో చూద్దాం!
ఇవి కూడా చదవండి
కథ :
చిత్తూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) కిరాణాకొట్టు వ్యాపారి. ఆయన ఏకైక కుమార్తె పేరు స్వాతి (వాసంతిక). ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ అమ్మాయికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. అప్పటివరకు తమతో పెరిగిన కూతురిని ఉద్యోగానికి పంపడానికి తొలుత సందేహించినా… తర్వాత అంగీకరిస్తాడు ప్రసాద్ రావు. హైదరాబాద్ వచ్చిన స్వాతి ఉద్యోగంలో చేరి ఓ హాస్టల్ లో వుంటుంది. భవాని (గాయత్రీ భార్గవి)అదే హాస్టల్లో ఉంటూ రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తుంది. ఒక నెల సవ్యంగా గడుస్తుంది. ఒ రోజు రాత్రి స్వాతి ఫోన్ స్విఛ్ ఆఫ్ రావడంతో కంగారుగా హైదరాబాద్ బయలు దేరతాడు ప్రసాద్ రావు. మరోవైపు స్వాతి కనిపించడం లేదని హాస్టల్ వార్డెన్ భవాని కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. స్వాతి మిస్సింగ్ కేసును రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను) ఎలా సాల్వ్ చేశారు? డైలీ స్వాతిని ఫాలో అయ్యే అబ్బాయి ఎవరు? ఊరిలో జరిగిన ఓ ఘటనకు, ఈ మిస్సింగ్ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనేది సిరీస్ 6 ఎపిసోడ్స్ చూసి తెలుసుకోవాలి.
నటీ నటుల హవబావలు :
మరో సారి తండ్రి పాత్రలో తన సీనియారిటీతో మరోసారి జీవించేశాడు రాజీవ్ కనకాల. ముఖ్యంగా మొదటిసారి కూతురి ఆఫీస్ కి వెళ్లే సీన్ మరియు 6వ ఎపిసోడ్ లో రివీల్ చేసే సందర్భంలో అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక ప్రస్తుతం తరం అమ్మాయిగా కూతురు పాత్రలో వాసంతిక మంచి నటనతో అలరించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో రెగ్యులర్ & టెంప్లేట్ బాడీ లాంగ్వేజ్ లోనే కనిపించింది. అయితే.. సిన్సియారిటీ పండించడంలో తన సత్తా చాటుకుంది. అలాగే.. ఈ సిరీస్ లో సర్ప్రైజ్ క్యాస్టింగ్ గాయత్రి భార్గవి, ఆమెను ఎంచుకోవడం వల్ల ఆ పాత్ర ఎండింగ్ అనేది ఎవరూ ఊహించలేరు కానీ, చివర్లో పండించాల్సిన కోపంతో కూడిన అక్కసును ఆమె క్యారీ చేయలేకపోయింది. బిందు చంద్రమౌళి తల్లి పాత్రలో భావోద్వేగాన్ని చక్కగా పోషించింది. మిగతా సహాయ నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఓటీటీ వీక్షకుల్లో ‘రెక్కీ’ వెబ్ సిరీస్కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, ఆ సిరీస్ దర్శకుడు కృష్ణ పోలూరు తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఈ ‘డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’కు కూడా ఆయన దర్శకుడు. సిరీస్ చివరిలో ఉదయభాను చేత చెప్పించిన ఓ మాట. ‘జాగ్రత్తకు, భయానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు… ధైర్యంతో’ అంటూ సందేశం ఇచ్చారు. అంతకు ముందు అమ్మాయిలకు ఏదైనా చెప్పుకొనే స్వేచ్ఛ తండ్రులు ఇవ్వాలంటూ మరొక మాట చెప్పారు. అదీ పేరెంట్స్ చాలా మందిని టచ్ చేసే అంశమే. ఈ సిరీస్కు టెక్నికల్ వేల్యూస్ సోసోగా ఉన్నాయి. డైలాగుల్లో విషయాన్ని క్లుప్తంగా చెప్పారు శృతి. యాసను జోడించడం వల్ల నేటివిటీ కనిపించింది. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్ పర్వాలేదు. ఓటీటీ కనుక క్వాలిటీ విషయంలో రాజీ పడినట్టు ఉన్నారు. సాలిడ్ పెర్ఫార్మన్స్లపై ఎక్కువ ఆధారపడ్డారు.
విశ్లేషణ:
‘డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’ సిరీస్ ప్రారంభం బావుంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ ఫీల్ ఇస్తుంది. అయితే త్వరగా థ్రిల్ నుంచి ఫ్యామిలీ వైపు వెళుతుందీ కథ. అమ్మాయి మిస్సింగ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్యారలర్గా నడిచే మరొక చైల్డ్ హుడ్ ఎపిసోడ్… ప్రతిదీ క్యూరియాసిటీ కలిగిస్తూ ముందుకు తీసుకు వెళతాయి. అయితే ఏదో ఒకటి మిస్సైన ఫీలింగ్ మరొకవైపు ఉంటుంది. ఈమధ్యకాలంలో వస్తున్న తెలుగు ఓటిటి సిరీస్ లు అనవసరమైన విషయాల్ని హైలైట్ చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి నానా హడావుడి పడుతున్నాయి. టార్గెట్ ఆడియన్స్ తో సంబంధం లేకుండా అన్నీ సిరీసుల్లోనూ శృతిమించిన శృంగారం లేదా హింస అనేవి కామన్ అయిపోయాయి. అలాంటి తరుణంలో అటువంటి అనవసరమైన సెన్సేషనలైజేషన్ ఏమీ లేకుండా, ఎలాంటి జుగుప్సాకరమైన సన్నివేశాలు లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సిరీస్ గా “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు”ని తీర్చిదిద్దడం అనేది ప్రసంసాపుర్వకం. వాసంతిక, రాజీవ్ కనకాల చక్కని నటన, కృష్ణ స్క్రీన్ ప్లే & థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ ను ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా జీ5 యాప్ లో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి






