Biker Movie Review: సరికొత్త స్పోర్ట్స్ డ్రామాతో ‘బైకర్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : యువి క్రియేషన్స్
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు.
సంగీతం: జిబ్రాన్, డీవోపీ: జె యువరాజ్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి, ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
సమర్పణ: విక్రమ్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
విడుదల తేది :03.04.2026
నిడివి :2 ఘంటల 35 నిముషాలు
హీరో శర్వానంద్(Sarwanand) వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తిరిగి ఫామ్‌లోకి వస్తున్నాడు. సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి విజయం సాధించిన ఆయన, ఈ రోజు ‘బైకర్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ సంపాదించింది. మరి ఈ ‘బైకర్’ హై స్పీడ్ తో గోల్ రీచ్ అయ్యాడా? ఈ ఏడాది శర్వాకు మరో హిట్ వచ్చిందా? లేదో సమీక్షలో చూద్దాం.
ఇవి కూడా చదవండి
కథ :
విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) ఓ ప్రతిభావంతమైన మోటోక్రాస్ రేసర్. అతని తండ్రి బుల్లెట్ సునీల్ (రాజశేఖర్)(Dr Rajsekhar) అతనికి కోచ్, గురువు. దేశంలో మోటోక్రాస్ రేసింగ్‌కు గుర్తింపు తీసుకురావాలనే కలతో విక్కీని చాంపియన్‌గా తీర్చిదిద్దుతాడు. దానికి తగినటుగా విక్కీ కూడా నంబెర్ వన్ బైక్ రేసర్ గా పేరు సంపాదిస్తాడు. కొడుకు ఛాంపియన్ అయిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో పోటిలకు పంపలనుకుంటాడు సునీల్. దాని కోసం ఐ యన్ జి అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత (అతుల్ కులకర్ణి) ఒప్పిస్తాడు. స్పాన్సరింగ్ కంపెనీ ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసిన తరువాత, మంచి అవకాశం వచ్చిన సమయంలో విక్కీ అనూహ్యంగా రేసింగ్‌ను వదిలేస్తాడు. తండ్రి ని చిన్న మాట అంటేనే భరించలేని విక్కీ ఎందుకు అలా చేశాడు? అనన్య (మాళవిక నాయర్) అతని జీవితంలోకి ఎలా వచ్చింది? తిరిగి రేసింగ్‌లోకి రావడానికి కారణం ఏమిటి? తండ్రి-కొడుకుల మధ్య బంధం ఎలా మారింది? అనేది సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
శర్వానంద్ తన కెరీర్లోనే పాత్రకు తగ్గ అత్యుత్తమ ఫిట్‌నెస్‌లో కనిపిస్తాడు. ఇలా కనపడానికి అతను చేసిన హై-ఇంటెన్సిటీ ప్రిపరేషన్ , ట్రైనింగ్ తో వర్క్ అవుట్ ఎంతో కష్టతరంగా ఉండేదని ఇటివల జరిగిన ప్రెస్ మీట్ లలో చెప్పుకొచ్చాడు. విభిన్న జానర్లలో తన ప్రతిభను చూపించాలని ప్రయత్నించడం చేయడం గొప్ప విషయం. ప్రొఫెషనల్ రేసర్ పాత్రలో ఆయన నిజాయితీతో నటించి, భావోద్వేగ సన్నివేశాల్లో కూడా అధ్బుత నటన కనపర్చాడు. రాజశేఖర్‌తో ఆయన చేసిన సన్నివేశాలు బాగా పనిచేశాయి. ‘బైకర్’ సినిమాతో రాజశేఖర్ (యాంగ్రీ మాన్) తన నటన తో మరొక మెట్టు ఎక్కారు. తన పాత్రను ఎంతో గౌరవంతో, నెమ్మదిగా, విభిన్న శైలిలో పోషించారు. వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ, కథలో ముఖ్య భాగంగా మారే విధంగా నటిస్తే, అలాంటి వెటరన్ నటులను చూడటం నిజంగా ఆనందంగా ఉంటుంది. ఇకపై రాజశేఖర్ తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌కు మొదటి ఎంపికగా మారే అవకాశం ఉంది. మాళవిక నాయర్ తన పాత్రలో సరిపడా నటించింది.
సాంకేతిక వర్గం పనితీరు :
బైకర్ ఒక టెక్నికల్‌గా మూవీ గా చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ పని బాగుంది మరియు రేసింగ్ ఎపిసోడ్స్ చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ముఖ్యమైన హైలైట్స్‌లో ఒకటి. ఎడిటింగ్ పని కూడా బాగుంది, డైలాగులు సరిపడా ఉన్నాయి. దర్శకుడు అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) భావోద్వేగాన్ని కొంతవరకు తెరపైకి తీసుకురాగలిగారు, కానీ ఎమోషనల్ పార్ట్ మరియు కాన్ఫ్లిక్ట్ ట్రాక్‌పై ఇంకా పని చేసి ఉండాల్సింది. బైకర్‌లో ఉన్న బలమైన భావోద్వేగం పూర్తిగా కాకుండా కొంతవరకు మాత్రమే చూపించారు. బైక్ రేసింగ్‌ను తెరపై చూపించడానికి టీమ్ ఎంతో కష్టపడి, మొత్తానికి ఒక డీసెంట్ ప్రోడక్ట్‌ను అందించారు యు వి క్రియేషన్స్(UV Creations) టీం.
విశ్లేషణ :
టాలీవుడ్లో ఇప్పటికే ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూశాం, కానీ మోటోక్రాస్ రేసింగ్‌ను ఇప్పటివరకు ఎవరూ అన్వేషించలేదు. అదే ‘బైకర్’ సినిమాకి ప్రత్యేకతగా నిలుస్తుంది. కొన్ని సన్నివేశాలు పరిచయంగా అనిపించినప్పటికీ, తెలుగు సినిమాకు కొత్తగా ఉన్న ఈ అంశం కథనాన్ని ఆసక్తికరంగా కొనసాగిస్తుంది. ఆ విషయంలో దర్శకుడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. స్పోర్ట్స్ సీక్వెన్సులు అద్భుతంగా చిత్రీకరించబడి, చక్కగా కొరియోగ్రఫీ చేయబడ్డాయి. కొన్ని క్షణాలు నిజంగానే ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచుతాయి. భారతదేశంలో అంతగా ప్రాచుర్యం లేని ఈ క్రీడను తీసుకుని, దానికి భావోద్వేగాలను జోడిస్తూ సినిమా రూపొందించడం ద్వారా దర్శకుడు సాధారణ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా మంచి ప్రయత్నం చేశాడు. ఒక స్పోర్ట్స్ డ్రామాలో కథనం ఆసక్తికరంగా ఉండాలి, భావోద్వేగం ప్రేక్షకుల వరకు చేరాలి. దర్శకుడు అభిలాష్ ఈ రెండు అంశాలు బాగా ప్రెజెంట్ అయ్యేలా చూసుకున్నారు. రేసింగ్ భారత్‌లో పెద్దగా ప్రసిద్ధి పొందని క్రీడ కాబట్టి, దాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం ఒక సవాలు. ఎక్కువ టెక్నికల్ వివరాల్లోకి వెళ్లకుండా కూడా సినిమా ఆసక్తిని కొనసాగించాలి.
హీరో జీవితంలో ఉన్న ఎత్తుపల్లాలు, భావోద్వేగ సన్నివేశాలు ఇంకా గట్టిగా తాకాలి అయినా సరే ఈ అవసరమైన అంశాలు సినిమాలో కొనసాగుతూ ఉండేలా దర్శకుడు చూసుకున్నారు. తెలుగు సినిమాలో మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కాబట్టి , కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలంగా అనిపించదు, కొంత బలవంతంగా రుద్ది నట్లు ఉంటుంది. విక్కీ రేసింగ్‌ను వదిలేయడం కూడా సౌకర్యవంతమైన రైటింగ్‌లా అనిపిస్తుంది, అలాగే కాన్ఫ్లిక్ట్ ముందే ఊహించగలిగేదిగా ఉంటుంది. రాజశేఖర్ మరియు అతని మనవడు మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తాయి. క్లైమాక్స్‌లో ఉన్న పొడవైన రేస్ సీక్వెన్స్ చాలా బాగా చిత్రీకరించారు సినిమాకి ఇదే ప్రధాన హైలైట్. కథ సింపుల్‌గా ప్రారంభమై, సునీల్ నారాయణ్ ఎంట్రీ తర్వాత అసలు ట్రాక్‌లోకి వెళ్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఒకటి పూర్తిగా అర్థం చేసుకునేలోపే మరో కథాంశం వస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది, అయినప్పటికీ, మీరు స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడితే, బైకర్ ఒక సంతృప్తికరమైన సినిమా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి






