Mumbai: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్టులే ట్విస్టులు..

సైఫ్ పై దాడి, తదనంతర పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. తొలుత ముంబై పోలీసులు వేరే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కాదని వదిలేశారు. ఆ తర్వాత షరీఫుల్ ఇస్లాం నిందితుడంటూ అరెస్ట్ చేశారు. తీరా చూస్తే.. ఆయన వేలిముద్రలు సైతం.. నేరం జరిగిన ప్రాంతంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ తో సరిపోలడం లేదని తెలుస్తోంది. దీంతో మరిన్ని వేలిముద్రలు సేకరించే పనిలో పడ్డారు బాంద్రా పోలీసులు.
ఇంతకూ సైఫ్ పై దాడి చేసిందెవరు? ఈ ప్రశ్నకు ప్రస్తుతం పోలీసుల దగ్గర జవాబు లేదు. కేసు విచారణలో భాగంగా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్(daya nayak) సైతం ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆతర్వాత అంతా కామ్ గానే ఉంది. అయితే ఇందులోనూ చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. సైఫ్ అలీఖాన్ భార్య, స్టార్ హీరోయిన్ కరీనా(kareena) కపూర్ తీరుపైనా.. పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ కు ఎందుకు ఏడేళ్ల కొడుకును ఇచ్చి ఆస్పత్రికి పంపించాల్సి వచ్చింది. అదీ ఇంటిలో అన్ని కార్లు ఉండగా.. ఆటోలో ఎందుకు పంపించారు. ఇవన్నీ ఆన్సర్ దొరకని ప్రశ్నలే.
అత్యంత పటిష్టమైన బందోబస్తు కలిగిన బాంద్రాలోని సైఫ్ ఉంటున్న ప్రాంతంలోనే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు నివసిస్తున్నారు. అందులోనూ సైఫ్.. రాయల్ ఫ్యామిలీ.. ఆయన ఇంటిలోకి అంత ఈజీగా వెళ్లడం కుదరదు. కానీ.. నిందితుడు ఎలా వెళ్లాడు. ఎలా దాడికి దిగాడు.? ఈ విషయంలో ఇంటిలో మనుషులు చెబుతున్న విషయాలు… కాస్త అనుమానాస్పదంగా ఉన్నాయి. దొంగతనానికి వెళ్లాడని.. అయితే కోటి రూపాయలు డిమాండ్ చేశాడంటున్నారు. చిల్లర దొంగ అయితే కోటి ఎందుకు డిమాండ్ చేస్తాడు. ఇది అర్థంకాని ప్రశ్నే.
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం.. అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో కేసువిచారణలో భాగంగా మరోసారి ఘటనా స్థలం నుంచి వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటికే కేసు విచారణ కోసం ముంబయి పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం.. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని.. అయితే, పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీఖాన్‌వేనా.. కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.