నా ఫస్ట్ మూవీ గీతా ఆర్ట్స్ యువి క్రియేషన్స్ వంటి పెద్ద బేనర్లలో చేయడం నా అదృష్టం : ప్రియాంక జవాల్కర్
విజయ్ దేవరకొండ హీరోగా యు.వి క్రియేషన్స్, జి.ఎ.2 పిక్చర్స్ పతాకాలపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్. నిర్మించిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రం ద్వారా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌తో జరిపిన ఇంటర్వ్యూ.
మీ నేపథ్యం గురించి?
– నేను అనంతపూర్‌లో పుట్టి పెరిగిన మరాఠి అమ్మాయిని. కంప్యూటర్ సైన్సులో ఇంజినీరింగ్ పూర్తి చేసి హార్వార్డ్‌లో స్టాటిటిక్స్ కోర్సు చేశాను. చిన్నప్పటి నుండి మూవీస్ చేయాలనే కోరిక బలంగా ఉండేది. ఆలా కొంత కాలం క్రితం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను. 2016లో భిక్షుగారి దగ్గర నేను నటనలో శిక్షణ పొందాను. నాలుగు నెలలు కోచింగ్ తీసుకున్న తర్వాత నా ఫోటోలు గీతా ఆర్ట్స్‌కి పంపాను. అలా ఆడిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘టాక్సీవాలా’ సినిమాకు నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
అనంతపురం పిల్లా అని హాష్ టాగ్‌తో మీ పుట్టినరోజు వేడుకను జరిపారు కదా ఎలా అనిపించింది?
– చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అనంతపురం నుండి హీరోయిన్స్ లేకపోవడం నాకు చాలా ప్లస్ అయ్యింది. అందుకే వారంతా సంతోషంగా మా అనంతపురం పిల్లా అని నా పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా నన్ను చాలా అభిమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ విషెస్ తెలిపారు.
తొలి సినిమాలోనే విజయ్ దేవరకొండలాంటి స్టార్ హీరోతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
– విజయ్ సెట్లో చాలా కూల్‌గా ఉంటారు. చాలా మంచి పెర్‌ఫార్మెర్. సినిమాలో నాకు నటిగా రాణించడానికి అవసరమయ్యే కొన్ని యాక్టింగ్ బేసిస్ కూడా నేర్పించారు. ఒక సీన్‌ను ఎన్ని సార్లు అనలైజ్ చేసుకోవాలో తనే నాకు నేర్పించారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తనే యాక్ట్ చేసి చూపించి హెల్ప్ చేసేవారు.
గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం ఎలా నిపించింది?
– నా ఫస్ట్ మూవీనే గీతా ఆర్ట్స్ లాంటి గొప్ప బ్యానర్‌లో చేయడం సంతోషంగా ఉంది. మొదట్లో నేనే ఈ సినిమాకు హీరోయిన్ అని నమ్మలేదు. సినిమా కొంత భాగం షూట్ అయిన తరువాత నమ్మకం కలిగింది.
డైరెక్టర్ రాహుల్ గురించి?
– రాహుల్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ప్రతీది చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. సెట్స్‌లో చాలా పేషన్స్‌గా ఉంటారు. ఆర్టిస్టులకు కావాల్సిన టైం, స్పేస్ ఇస్తూ వారిలోని మంచి నటుల్ని బయటకు తీస్తారు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌లా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో మీ పాత్ర గురించి?
– ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. కథపరంగా హీరో ఒక టాక్సీ డ్రైవర్. అలా ఒక ట్రిప్‌లో నేను హీరోతో కలిసి ప్రయాణిస్తాను. తర్వాత నుండి హీరోతో కలిసి ట్రావెల్ అవుతూ ప్రేక్షకులను రిలాక్స్ చేసే క్యారెక్టర్ నాది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
ఫ్యూచర్‌లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు?
– ఇలాంటి పాత్రలే చేయాలి అని అనుకోవడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకొనే ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు ప్రియాంక జవాల్కర్.