Rajamundry: స్టూడియోలు పెట్టండి.. ఉపాధి చూపండి..చిత్ర పరిశ్రమ(tollywood)కు ఏపీ సర్కార్ ఆహ్వానం..

ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan).. టాలీవుడ్ కు ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో యువత పెద్దసంఖ్యలో ఉన్నారని.. వారందరికీ సినిమా అంటే ప్రాణమన్నారు. టికెట్ ధరలు పెరుగుతున్నా.. తమ అభిమానహీరో సినిమా చూడాలన్న తపనతో ఉంటారన్నారు. నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు(chandrababu).. ఎప్పుడు సినీపరిశ్రమకు అండగా ఉన్నారే తప్ప, ఇబ్బంది పెట్టలేదన్నారు. రాష్ట్రప్రభుత్వానికి సినీపరిశ్రమపై అపారమైన గౌరవం ఉందన్నారు డిప్యూటీ సీఎం.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తే అండగా ఉంటాం..
‘‘తెలుగు చిత్రపరిశ్రమ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు పవన్. ఆంధ్ర యువత 24 క్రాఫ్ట్‌లలో రాణించేలా, ఉపాధి పొందేలా స్టూడియోలు, స్టంట్ శిక్షణ స్కూళ్లు పెట్టాలి. సీఎం చంద్రబాబు, మేమంతా చిత్ర పరిశ్రమకు అండగా ఉంటాం’’ అని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు దిల్‌రాజు(Dil raju)ను ఉద్దేశించి అన్నారు. ‘‘కోనసీమలో కేరళను మించిన ప్రదేశాలు ఉన్నాయి. గోదావరి తీరం, కడపలో గండికోట, సిద్ధవటం, పార్వతీపురం మన్యం ఇలా ఎన్నో ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. చిత్ర పరిశ్రమ వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మీ కోసం ఒళ్లు వంచి పనిచేస్తాం’’ అని పవన్ తెలిపారు.
‘‘సినీ పరిశ్రమ అడగ్గానే టికెట్ల ధరలు పెంచుతున్నారని చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. డిమాండు, సరఫరా ఆధారంగానే ధరల పెంపు ఉంటుంది. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్‌మేన్ సినిమా టికెట్ బ్లాక్‌లో కొనుక్కుని చూశాను. బ్లాక్‌లో పెట్టిన డబ్బు ఎవరికో వెళ్తుంది. అదే టికెట్ మీద పెడితే సినీ పరిశ్రమకు వెళ్తుంది. తెలుగు సినిమాకు ప్రపంచంలో మార్కెట్ పెరిగింది. సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. పెరిగిన ప్రతి రూపాయికీ 18 శాతం జీఎస్టీ చెల్లిస్తారు’’ అని పవన్‌కల్యాణ్ తెలిపారు. ‘‘నా బీమ్లానాయక్ సినిమాకు టికెట్ ధర పెంచకపోగా తగ్గించేశారు. చాలామంది సినిమా హీరోలు కూటమికి మద్దతు తెలపలేదు. అయినా మేం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. చిత్రపరిశ్రమకు రాజకీయ(political) రంగు పులమటం మాకు ఇష్టం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
మేము లో లెవల్ వ్యక్తులం కాదు..
‘‘సినిమా టికెట్ల ధరలతో హీరోలకు పనేంటి..? హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ, యూనియన్లు వచ్చి మాట్లాడాలి. అంతేగానీ హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలి అనేంత లో లెవల్ వ్యక్తులం మేం కాదు’’ . ‘‘సినిమాలు తీసేవారు, సినిమా సాధక బాధకాలు తెలిసినవారే మాట్లాడాలి. అప్పుడే పరిశ్రమలో క్రమశిక్షణ అలవడుతుంది. వారితోనే కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది ’’ అని పవన్ స్పష్టం చేశారు. ‘‘మహానటుడు ఎన్టీఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణ కాంగ్రెస్‌లో ఉన్నా ఎప్పుడూ వివక్ష చూపలేదు. అదీ చిత్రపరిశ్రమ ఔన్నత్యం’’ అన్నారు.