Saif Ali Khan: సైఫ్ దాడి చేసింది రెజ్లర్…?

సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేసిన వ్యక్తి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు పోలీసులు. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం బంగ్లాదేశ్ (Bangladesh)లో అతను జాతీయ స్థాయి రెజ్లర్ అని పోలీసుల విచారణలో తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. జనవరి 19న థానేలో అరెస్టయిన అనంతరం బంగ్లాదేశ్ లో జిల్లా, జాతీయ స్థాయిలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నట్టు అతను వివరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సరైన పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ కు చేరుకున్నాడు. దాడికి కొన్ని నెలల ముందు నుంచే అతను ముంబైలో నివసిస్తున్నాడు.
బాంద్రాలోని సద్గురు శరణ్ భవనంలో ఉన్న సైఫ్ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే షెహజాద్ అడుగుపెట్టినట్టు సమాచారం. ఈ దాడి తర్వాత షెహజాద్ బాంద్రా, దాదర్, వర్లీ, అంధేరి, థానేతో సహా ముంబైలోని పలు ప్రాంతాల్లో తిరిగాడు. అయితే, థానేలోని లేబర్ క్యాంప్ సమీపంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా కోర్టు అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అంగీకరించింది. షెహజాద్ బంగ్లాదేశ్ జాతీయుడని నిరూపించేందుకు ముంబై పోలీసులకు సాక్ష్యాలు లేవని అతని తరపు న్యాయవాది కోర్ట్ లో వాదించడం గమనార్హం.
షెహజాద్ తన కుటుంబంతో కలిసి 7 సంవత్సరాలకు పైగా ముంబైలో నివసిస్తున్నాడని అతని న్యాయవాది పేర్కొన్నాడు. షెహజాద్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతన్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షెహజాద్ కు కొన్ని నెలల క్రితం వర్లీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా దోపిడీ ఘటనలో పాల్గోనట్టు పోలీసులు గుర్తించారు. డైమెండ్ రింగ్ దొంగలించడంతో అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నాడు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దాడికి గల కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.