Tollywood: సినిమా వాళ్లకు చంద్రబాబు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా వాళ్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. సంధ్య థియేటర్ ఘటన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వాధినేతలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక సినిమా వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కూడా సినిమా వాళ్లకు షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ (Telangana)లో బెనిఫిట్ షోల విషయంలో అలాగే టికెట్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది.
టికెట్ ధరలను పెంచే అవకాశం లేదని… బెనిఫిట్ షోల విషయంలో కూడా వెనుకకు తగ్గేది లేదని స్పష్టంగా చెప్పింది. ఇక ఉదయం నాలుగు గంటల నుంచి తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి షోలకి మాత్రం అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. తాజాగా ఇదే నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా. సినిమాలకు అర్ధరాత్రి షోలు రద్దు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించడం కష్టమని స్పష్టం చేసింది.
అర్ధరాత్రి ఒంటిగంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి నిరాకరించింది రాష్ట్రప్రభుత్వం. 10 రోజులపాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని… ఐదు ప్రదర్శనలోనే ఒకటి బెనిఫిట్ షో గా నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేసింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించారు. ఈ నిర్ణయాలతో భవిష్యత్తులో భారీ బడ్జెట్ సినిమాలకు కచ్చితంగా కష్ట కాలమే. టికెట్ ధరలను కూడా భవిష్యత్తులో భారీ పెంచే అవకాశం లేదనే క్లారిటీ వస్తోంది.