IT Raids: సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ సోదాలు ఎందుకు..?

తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో అత్యధిక సినిమాలు తీస్తున్న ఇండస్ట్రీ మనదే. ఇటీవలికాలంలో టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తమైంది. పలు దేశాల్లో సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. భారీ వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో అందరి కళ్లూ టాలీవుడ్ పై పడ్డాయి. ముఖ్యంగా గతేడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప 2 (Pushpa 2) , ఈ సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ (Game Changer), డాకు మహరాజ్ (Daku Maharaj) , సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టినట్లు ఆ చిత్ర యూనిట్లు ప్రకటించాయి. బహుశా ఆ కలెక్షన్ల లెక్క తేల్చేందుకో ఏమో పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి.
రెండ్రోజులుగా హైదరాబాద్ లోని పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సోదాలు (IT Raids) నిర్వహిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju), ఆయన కుమార్తె, సోదరుడి నివాసాలతో పాటు పుష్ప దర్శకుడు సుకుమార్ (Director Sukumar), నిర్మాతలు మైత్రీ మూవీస్ (Mythri Movies) అధినేతల ఇళ్లపైన కూడా ఈ సోదాలు జరిగాయి. తమ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిసిందని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఈ సోదాలు జరగడం చాలా మందిని షాక్ కు గురిచేసింది. ఆ కలెక్షన్లకు సంబంధించిన లెక్కలు తేల్చేందుకే ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టి ఉంటారని భావిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీకి పరిశ్రమ హోదా లేదు. కాబట్టి సినిమాలకు ఎన్ని లాభాలు వస్తున్నాయి.. ఎంత నష్టపోతున్నారు అనే దానిపై లెక్కాపత్రం ఉండదు. వాళ్లు చెప్పింది నమ్మాలంతే.! ఆ లెక్కలు వాస్తవమా కాదా. నిజంగానే వాళ్లు చెప్పిన నెంబర్లకు సరిపడా ట్యాక్స్ లు పే చేశారా.. చేస్తున్నారా.. అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా వరకూ లావాదేవీలు బ్లాక్ లోనే జరుగుతుంటాయి. ఫైనాన్షియర్ల (financiars) నుంచి ఎక్కువ మొత్తానికి వడ్డీలకు తెచ్చి సినిమా పూర్తి చేసిన వెంటనే చెల్లించేస్తుంటారు. వీటన్నింటికీ లెక్కలుండవ్.. ఇలాంటి తనిఖీల ద్వారా అలాంటి లెక్కలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
భారీ వసూళ్లు రాబట్టాయని చిత్ర యూనిట్లే ప్రకటించాయి. మరి అందుకు సంబంధించిన పెట్టుబడులను ఎక్కడి నుంచి తెచ్చారు.. ఎంతమేర సినిమాలకు ఖర్చయింది.. ఎవరెవరి నుంచి ఎంత ఫైనాన్స్ కు తెచ్చారు.. వసూళ్లు ఎంత మేర వచ్చాయి.. అందుకు తగ్గట్టు పన్ను చెల్లించారా.. లేదా చెల్లించేందుకు సిద్ధమయ్యారా.. లాంటి అంశాలను తేల్చేందుకే ఐటీ శాఖ సోదాలు నిర్వహించి ఉంటుందని సమాచారం. ఐటీ సోదాలు ఎప్పుడూ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపైనే ఉంటాయి త్వరలో హీరోల ఇళ్లపైన కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం.