Sivaji: ఆ సంఘటన తర్వాత మూడు రోజులు నిద్ర పోలేదు
మహిళల దుస్తులపై గతంలో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు శివాజీ(Shivaji) తాజాగా ఆ ఘటనపై మరోసారి స్పందిస్తూ కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ అంశంలో తనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసిన వారు బయటివాళ్లు కాదని, తనకు బాగా తెలిసిన వ్యక్తులేనని వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు తాను నిజంగా షాక్కు గురయ్యానని ఆయన చెప్పారు. అయితే వారి పేర్లు బయటపెట్టడం సరికాదని, ఇప్పటికీ వారంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధాలు, అభిప్రాయ భేదాలు వేర్వేరని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ, ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శివాజీ తెలిపారు. ఎన్నో ప్రెస్మీట్లు, టీవీ డిబేట్స్ లో మాట్లాడినా ఎప్పుడూ నోరు జారలేదని, కానీ ఆ రోజు అనుకోకుండా రెండు పదాలు తప్పుగా నోరు జారానని చెప్పారు. ఆ వ్యాఖ్యల తర్వాత మూడు రోజుల పాటు తనకు నిద్రపట్టలేదని, తీవ్ర మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఇది కేవలం ఒక వివాదం కాదని, తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందని భావించానని అన్నారు. మాట్లాడే ముందు మరింత జాగ్రత్త అవసరమనే పాఠాన్ని ఈ ఘటన నేర్పిందని ఆయన అంగీకరించారు.
ఇక ఈ వివాదంలో తన పేరు అనవసరంగా జోడించబడిందని భావిస్తున్న అనసూయ భరద్వాజ్(anasuya bharadwaj) గురించి కూడా శివాజీ స్పష్టత ఇచ్చారు. అనసూయను తానేమీ అనలేదని, ఆమెపై తనకు గౌరవమే ఉందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతున్న మాటల ప్రభావం వెంటనే అర్థం కాకపోవచ్చని, అలాంటి ఒక సందర్భంలోనే తన నుంచి ఆ తప్పు పదాలు వచ్చాయని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత తన మాటలపై మరింత జాగ్రత్తగా ఉంటానని శివాజీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి

















