Manchu Mohan Babu: చల్లారని ‘మంచు’ చిచ్చు.. ఇంటికోసం మోహన్ బాబు పోరాటం..!!

సినీ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఫ్యామిలీలో ఆస్తి పంపకాల వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇది చినికి చినికి గాలి వానగా మారి వీధికెక్కింది. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్ (Manchu Manoj) ఇద్దరూ సై అంటే సై అనుకుంటూ పోరాటాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. హైదరాబాద్ మొదలు రంగంపేట (Rangampet) వరకూ మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మోహన్ బాబు తన జలపల్లి (Jalpalli) నివాసాన్ని తనకు అప్పగించాల్సిందిగా జిల్లా మెజిస్ట్రేట్ (District Magistrate) కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీనియర్ సిటిజన్ యాక్ట్ (Senior Citizen Act) ను అస్త్రంగా వాడుకున్నారు.
మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు. మంచు విష్ణు.. మంచు మనోజ్..! కొంతకాలం సినిమాల్లో బాగానే బిజీగా ఉన్నారు. కుటుంబపరంగా కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. అయితే మనోజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి భూమా మౌనిక రెడ్డిని (Bhuma Mounika Reddy) వివాహం చేసుకున్న తర్వాత మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. మనోజ్ అడిగినంత డబ్బు ఇచ్చేందుకు మోహన్ బాబు నిరాకరించినట్లు సమాచారం. మౌనిక మాటలు విని మనోజ్ తాగుబోతుగా మారాడనేది మోహన్ బాబు ఆరోపణ. ఈ విషయంలో మనోజ్ ఒంటరి కాగా మిగిలిన ఫ్యామిలీ అంతా ఒక వైపు నిలబడింది.
మనోజ్ ను జలపల్లిలోని నివాసంలోకి రాకుండా మోహన్ బాబు, విష్ణు వర్గీయులు అడ్డుకోవడంతో వివాదం మొదటిసారి తెరపైకి వచ్చింది. తనను ఇంట్లోకి రానివ్వట్లేదని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన ఘటనలో ఓ విలేఖరిపైన మోహన్ బాబు చేయి చేసుకోవడం వివాదం రేపింది. మోహన్ బాబుపై కేసు నమోదైంది. దీంతో మోహన్ బాబు జల్ పల్లి నివాసాన్ని (Jalpalli House) వదిలేసి తిరుపతి జిల్లా రంగంపేటలోని విద్యానికేతన్ కు వెళ్లిపోయారు. అక్కడే మోహన్ బాబు ప్రస్తుతం ఉంటున్నారు. సంక్రాంతి వేళ విద్యానికేతన్ (Vidyanikethan) లోని తన తాత, అవ్వ సమాధిని సందర్శించేందుకు వెళ్లారు మనోజ్. అది వివాదాస్పదమైంది.
తాజాగా మోహన్ బాబు తన జల్ పల్లి నివాసాన్ని తనకు అప్పగించేలా చూడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ (District Collector) కు రిక్వస్ట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం జల్ పల్లి నివాసంలో మంచు మనోజ్ ఉంటున్నారు. కొంతమంది తన ఇంటిని ఆక్రమించుకున్నారని.. దాన్ని తనకు స్వాధీన పరచాలని మోహన్ బాబు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తికి సంబంధించి వివరాలు తెప్పించుకున్నారు. మనోజ్ కు నోటీసులు జారీ చేశారు. మరి మనోజ్ ఇంటిని ఖాళీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మనోజ్ ఖాళీ చేయకపోతే కలెక్టర్ బలవంతంగా ఖాళీ చేయించే అవకాశం ఉంటుంది.