ఏకంగా బిలియన్ డాలర్ల ఐపీఓతో స్టాక్ మార్కెట్లోకి ‘జెప్టో’ గ్రాండ్ ఎంట్రీ!
భారతీయ క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే ‘జెప్టో‘ (Zepto). ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే ఇంటి గుమ్మం ముందుకు సరుకులు తీసుకొచ్చే ఈ స్టార్టప్ ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. అంచనాలకు మించి అత్యంత వేగంగా ఎదుగుతున్న జెప్టో.. ఏకంగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,300 కోట్లు) భారీ ఐపీఓ (IPO)తో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించింది.
ఇవి కూడా చదవండి
రూ. 58 వేల కోట్ల వాల్యుయేషన్..!
గత ఏడాది డిసెంబర్లోనే జెప్టో (Zepto) పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఆ సమయంలో సంస్థ మార్కెట్ విలువను సుమారు 7 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 58 వేల కోట్లు) అంచనా వేశారు. ఇప్పుడు సెబీ నుంచి అధికారిక ఆమోదం లభించడంతో, రాబోయే 6 నుంచి 7 వారాల్లో అప్డేట్ చేసిన ఆర్థిక వివరాలతో కూడిన పత్రాలను సంస్థ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది జూలై నాటికే దలాల్ స్ట్రీట్‌లో జెప్టో (Zepto) షేర్లు లిస్టింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా సేకరించే నిధులన్నీ కేవలం ‘కొత్త షేర్ల జారీ’ ద్వారానే ఉండటం విశేషం.
నిధుల కోసమే ఈ ప్లాన్!
భారతదేశంలో ప్రస్తుతం క్విక్ కామర్స్ మార్కెట్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ప్రజల కొనుగోలు విధానం మారిపోవడంతో ఈ మార్కెట్ విలువ సుమారు 10-11 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ రంగంలో జెప్టోకు (Zepto) ప్రధానంగా జొమాటోకు చెందిన ‘బ్లింకిట్’ (Blinkit), అలాగే ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ (Swiggy Instamart)లతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ దిగ్గజాలకు చెక్ పెడుతూ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, వేర్‌హౌస్‌ల విస్తరణకు జెప్టోకు భారీగా నిధులు అవసరం. అందుకే ఈ ఐపీఓ ఆ సంస్థ భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలకు కీలకం కానుంది.
ఆ భయాలను దాటుకుని..
సాధారణంగా గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు కొత్త ఐపీఓల వైపు, ముఖ్యంగా టెక్ లేదా స్టార్టప్ కంపెనీల వైపు చూసేందుకు ఆచి తూచి అడుగులేస్తుంటారు. ఇలాంటి ప్రతికూల, అప్రమత్త పరిస్థితుల్లో కూడా జెప్టో (Zepto) ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పబ్లిక్ ఆఫర్‌కు రావడం భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. జనం నుంచి వస్తున్న డిమాండ్‌ను, ఇన్వెస్టర్ల ఆసక్తిని క్యాష్ చేసుకుంటూ ‘జెప్టో’ ఏ స్థాయిలో ఐపీఓను సక్సెస్ చేసుకుంటుందో చూడాలి!
ఇవి కూడా చదవండి






