అమెరికా రూ.4,590 కోట్ల ఫండింగ్.. ఎందుకో తెలుసా?
శ్రీలంక మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న చైనాకు దీటుగా నిలబడేందుకు అమెరికా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీ సెజ్) లిమిటెడ్ భాగస్వామిగా ఉన్న కన్సార్షియం కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ (సీడబ్ల్యూఐటీ) ప్రైవేట్ లిమిటెడ్‌కు అమెరికా 55.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.4,590 కోట్లు) నిధులు సమకూర్చనుంది. పోర్ట్ ఆఫ్ కొలంబోలో కొత్తగా డీప్ వాటర్ షిప్పింగ్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి అమెరికా ప్రభుత్వానికి చెందిన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్సీ) ఆర్థికంగా మద్దతివ్వనుందని ఏపీసెజ్ లిమిటెడ్ తెలిపింది. ఈ ఫండింగ్ శ్రీలంకలో ప్రైవేట్ రంగ పెట్డుబడుల ఆధారిత వృద్ధికి, విదేశీ మారక నిల్వల పెరుగుదలకు దోహదపడనుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ అండ్ గ్రీన్ పోర్ట్‌లు వంటి సుస్థిర మౌలిక వసతుల అభివృద్ధికి అమెరికా, శ్రీలంక, ఇండియా పరస్పర సహకారాన్ని కొనసాగించనున్నాయంది.






