భారత్, అమెరికాలు నిర్ణయం…సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధికి

ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి, విస్తరణకు ఉమ్మడిగా మార్గాలను అన్వేషించాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ పరివర్తన జోరుకు అనుగుణంగా సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలను తీర్చిదిద్దేలా చూడాలని తీర్మానించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ప్రారంభించిన సెమీకండక్టర్ మిషన్‌తో చేతులు కలపనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సాంకేతిక భద్రత, నవకల్పన (ఐటీఎస్‌ఐ) నిధి కింద ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి, విస్తరణకు మార్గాలను అన్వేషిస్తామని వివరించింది. ఈ రంగంలో రెండు దేశాల భాగస్వామ్యం ద్వారా ప్రపంచస్థాయిలో మరింత దృఢ, భద్రమైన, సుస్థిర సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ సాకారమవుతుందని పేర్కొంది. ఇందులో తొలిదశ కింద భారత్‌లోని సెమీకండక్టర్ పరిశ్రమ, నియంత్రణ వ్యవస్థ, మానవవనరులు, మౌలికవసతుల అవసరాలపై మదింపు వేయనున్నట్లు తెలిపింది.