భారత ఆర్థిక వ్యవస్థకు షాక్.. ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణ ముప్పు!
వేగంగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థకు (Indian Economy) ఊహించని బ్రేకులు పడనున్నాయా? ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు దేశ వృద్ధిని తీవ్రంగా దెబ్బతీయనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, భగ్గుమంటున్న ముడి చమురు ధరల ప్రభావం నేరుగా భారత వృద్ధి రేటు (GDP)పై పడనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ (S&P Global), ఏడీబీ, మూడీస్ వంటి సంస్థలు నివేదికలు విడుదల చేశాయి.
ఎస్ అండ్ పీ గ్లోబల్ హెచ్చరికలు
ఎస్ అండ్ పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్తంగా విడుదల చేసిన ‘ఇండియా ఫార్వర్డ్’ నివేదిక దేశ ఆర్థిక (Indian Economy) స్థితిపై కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ వృద్ధి రేటును గతంలో 7.1 శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు దాన్ని ఏకంగా 6.6 శాతానికి కుదించింది. పశ్చిమాసియాలో రగులుతున్న సంక్షోభం వల్ల ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనికి తోడు రూపాయి విలువలో హెచ్చుతగ్గులు భారత్‌పై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి స్పష్టం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే శీతాకాలంలో రసాయన ఎరువుల కొరత ఏర్పడి, వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
ఏడీబీ అంచనా.. ద్రవ్యోల్బణం పైకే!
ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) అంచనాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బకు భారత వృద్ధి రేటు మరో 0.6 శాతం తగ్గి, ఏకంగా 6.3 శాతానికే పరిమితమవుతుందని ఏడీబీ చీఫ్ ఎకనామిస్ట్ ఆల్బర్ట్ పార్క్ కుండబద్దలు కొట్టారు. మనం దాదాపుగా చమురు, గ్యాస్ దిగుమతులపైనే ఆధారపడినందున.. దేశంలో ద్రవ్యోల్బణం మరో 2.4 శాతం ఎగబాకి 6.9 శాతానికి చేరుతుందని ఆయన వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం స్థిరంగా ఉంచినప్పటికీ, దిగుమతి చేసుకునే ఇతర వస్తువుల ధరలు పెరిగి టోకు ద్రవ్యోల్బణం సామాన్యుడి జేబుకు చిల్లులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ (Indian Economy) తిరిగి పుంజుకుంటుందని ఏడీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.
మూడీస్ ఊరట.. కానీ ఓ చిక్కుంది!
ఒకవైపు ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. మూడీస్ రేటింగ్స్ మాత్రం భారత్‌కు కొంత ఊరటనిచ్చే ప్రకటన చేసింది. 2020 నుంచి అత్యంత వేగంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) భారత్ సత్తా చాటుతోందని కితాబిచ్చింది. దేశంలో భారీగా ఉన్న విదేశీ మారకపు నిల్వలు, స్థిరమైన ద్రవ్యోల్బణ అంచనాలు, మారకపు రేట్ల సర్దుబాటు లాంటి అంశాలు.. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి గ్లోబల్ కుదుపులైనా తట్టుకునే శక్తిని ఇస్తాయని పేర్కొంది. అయితే దేశంపై ఉన్న అధిక రుణ భారం, ద్రవ్యలోటు మాత్రం వెంటవెంటనే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వానికి సంకటంగా మారుతాయని హెచ్చరించింది. ఏది ఏమైనా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) కలను సాకారం చేసుకోవాలంటే ఆహార, ఇంధన భద్రతలో కేంద్రం తక్షణమే కఠిన సంస్కరణలు చేపట్టాలని, ముఖ్యంగా విపత్కర పరిస్థితుల కోసం ఒక సమగ్రమైన ‘ఎనర్జీ స్టోరేజ్ పాలసీ’ని తీసుకురావాలని ఈ నివేదికలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి






