అమెరికాలో ఎస్బీఐ యోనో సేవలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) త్వరలోనే తన బ్యాంకింగ్ మొబైల్ యాప్ యోనో గ్లోబల్ ను సింగపూర్, అమెరికాల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది. ఆ దేశాల్లోని తన ఖాతాదార్లు డిజిటలైజ్డ్ రెమిటెన్స్, ఇతర సేవలను మరింత సులభంగా వినియోగించుకునేందుకు ఇది తోడ్పడుతుందని ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఐటీ) విద్యా కృష్ణన్ తెలిపారు. ఇందుకోసం సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ ప్లాట్ఫాం సంస్థలు, స్థానిక నియంత్రణ సంస్థలు, సెంట్రల్ బ్యాంక్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్తోనూ చర్చలు నిర్వహించినట్లు తెలిపారు. సింగపూర్లో అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారని, రెండు దేశాల మధ్య రెమిటెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్బీఐ 9 దేశాల్లో యోన్లో గ్లోబల్ను అందిస్తోంది. దాదాపు 7800 కోట్ల డాలర్ల విదేశీ లావాదేవీలు దీనిద్వారా జరుగుతున్నాయి. సింగపూర్లో పేనౌ తో కలసి ఎస్బీఐ యోనో గ్లోబల్ సేవలను అందించనుంది.






