బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు …
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. భారతదేశ దృఢ, సంకల్పాన్ని, ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. స్వయంసమృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు.
సమాజంలోని అన్ని వర్గాలకు చేయూత నిచ్చేలా బడ్జెట్ ఉందని, మౌలిక వసతులకు నిర్మలా పెద్దపీట వేశారని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌కు బడ్జెట్ విజిన్‌లా పనిచేస్తుందని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై బడ్జెట్ దృష్టి సారించిందని చెప్పారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులు చాలా సులువుగా రుణాలు తీసుకోగలగుతారని అన్నారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ సహాయంతో ఏపీఎంసీ మార్కెట్లు పటిష్టమవుతాయని అన్నారు. యువతకు కొత్త అవకాశాల కల్పనతో పాటు మానవ వనరులు, మౌలిక వసతుల వృద్ధితో సాంకేతికపరంగా పురోగమించడానికి బడ్జెట్ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సామాన్యుడిపై పన్ను భారం ఉంచినట్టు చాలామంది అభిప్రాయపడవచ్చని, అయితే, బడ్జెట్ పారదర్శకతపై తాము దృష్టి సారించామని మోదీ పేర్కొన్నారు.






