Biden : బైడెన్ ప్రభుత్వ నిర్ణయంపై నిప్పన్, యూఎస్ స్టీల్ దావా

పిట్స్‌బర్గ్‌కు చెందిన యూఎస్ స్టీల్ కంపెనీ (US Steel Company )ని దాదాపు 15 బిలియన్ డాలర్ల ( దాదాపు రూ.1.27 లక్షల కోట్ల)తో కొనుగోలు చేయాలన్న జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ (Nippon Steel) ప్రతిపాదనకు అడ్డుకట్టవేసిన బైడెన్ (Biden) ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ నిప్పన్ స్టీల్, యూఎస్ స్టీల్ కోర్టులో దావా వేశాయి. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఇరు కంపెనీలు కేసు దాఖలు చేశాయి. అది కేవలం రాజకీయ నిర్ణయమని ఇరు కంపెనీలు ఆరోపించాయి. అమెరికా జాతీయ భద్రతకు కానీ, అమెరికా ఉక్కు వర్గాలకు కానీ ఈ లావాదేవీ ఎటువంటి హానీ తలపెట్టదు. పైగా ఈ కొనుగోలు వల్ల అమెరికాలో ఉక్కు సరఫరా పెరుగుతుంది. చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న దేశీయ ఉక్కు పరిశ్రమ బలోపేతమవుతుందని ఇరు కంపెనీలు తెలిపాయి. యూఎస్ స్టీల్‌లో 2.7 బి. డాలర్ల పెట్టుబడులకు నిప్పన్ ఇప్పటికే హామీనిచ్చింది. వచ్చే దశాబ్దంలో అమెరికాలో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించబోమనీ స్పష్టం చేసింది. నియంత్రణ సంస్థలు ఈ లావాదేవీపై నిర్ణయం తీసుకోలేకపోవడంతో, టేకోవర్‌ను నిలిపివేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.