మీ ఫోన్లో సిమ్ లేకపోతే ఇకపై వాట్సప్ రాదు.. నిబంధనలు మారాయ్ గురూ!
హైదరాబాద్: క్యాలెండర్ మారినప్పుడల్లా ఆర్థిక , సాంకేతిక రంగాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోవడం సహజం. అదే క్రమంలో 2026 మార్చి 1వ తేదీ నుండి సామాన్యుల జీవితంపై ప్రభావం చూపించే పలు కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా సైబర్ మోసాల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం , సంబంధిత సంస్థలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి.
కమ్యూనికేషన్ యాప్స్‌కు ‘సిమ్ బైండింగ్’ తప్పనిసరి
వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల వినియోగంలో కేంద్రం కీలక మార్పులు తెచ్చింది. మార్చి 1 నుండి ఈ యాప్స్‌కు సిమ్ కార్డు బైండింగ్ నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ ఫోన్లో సిమ్ కార్డు లేకపోయినా లేదా దానిని తొలగించినా, ఆయా యాప్ సేవలు ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి. వెబ్ బ్రౌజర్లో ఈ యాప్‌లను వాడుతున్నట్లయితే, ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయ్యేలా నిబంధన రూపొందించారు. సైబర్ నేరగాళ్లు సిమ్ లేకుండా యాప్‌లను వాడుతూ చేసే మోసాలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఇవి కూడా చదవండి
యూటీఎస్ (UTS) స్థానంలో ‘రైల్‌వన్’ యాప్
రైల్వే ప్రయాణికులకు కూడా ఒక ముఖ్యమైన మార్పు ఎదురుకానుంది. జనరల్ , ప్లాట్‌ఫామ్ టికెట్ల బుకింగ్ కోసం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యూటీఎస్ (UTS) యాప్ సేవలు మార్చి 1 నుండి నిలిచిపోనున్నాయి. దీని స్థానంలో రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘రైల్‌వన్’ (RailOne) యాప్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాత యాప్‌లోని ‘ఆర్-వాలెట్’లో బ్యాలెన్స్ ఉంటే, అది నేరుగా కొత్త రైల్‌వన్ యాప్‌నకు బదిలీ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
యూపీఐ లావాదేవీలకు బయోమెట్రిక్ రక్షణ
డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసే దిశగా బ్యాంకులు అడుగులు వేస్తున్నాయి. ఇకపై యూపీఐ (UPI) ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు కేవలం పిన్ (PIN) మాత్రమే కాకుండా, అదనంగా బయోమెట్రిక్ లేదా ఇతర ఆథరైజేషన్ అవసరమవుతుంది. ఈ అదనపు భద్రతా పొర వల్ల యూజర్ల అనుమతి లేకుండా జరిగే మోసపూరిత లావాదేవీలను నివారించవచ్చు.
గుర్తింపు కోసం ‘1600 సిరీస్’ నంబర్లు
బ్యాంకులు , ఆర్థిక సంస్థల నుండి వచ్చే కాల్స్‌ను గుర్తించడం ఇకపై సులభం కానుంది. ట్రాయ్ (TRAI) నిబంధనల ప్రకారం, బ్యాంకులు , ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు చేసే కాల్స్ తప్పనిసరిగా ‘1600 సిరీస్’ నంబర్లతోనే ఉండాలి. మార్చి 1 నుండి ఎన్బీఎఫ్సీలు (NBFCs), మార్చి 15 నుండి స్టాక్ బ్రోకర్లు కూడా ఇదే సిరీస్ నంబర్లను వాడాల్సి ఉంటుంది. సాధారణ ఫోన్ నంబర్ల ద్వారా బ్యాంకుల పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్ కాల్స్‌ను గుర్తించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి

















