RC Bhargava :డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు లొంగొద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలపై భారత కార్పొరేట్ వర్గాల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఈ బెదిరింపులకు ఏ మాత్రం లొంగకూడదని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) చైర్మన్ ఆర్‌సీ భార్గవ (RC Bhargava) ప్రభుత్వాన్ని కోరారు. వాణిజ్యం కంటే దేశ గౌరవ మర్యాదలే ముఖ్యమన్నారు. ఈ కీలక సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలవాలని కోరారు. మారుతి సుజుకీ(Maruti Suzuki) ఇండియా వాటాదారుల 44వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఉద్దేశించి మాట్లాడుతూ భార్గవ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి ట్రంప్ సుంకాల పోటే కారణమన్నారు. దౌత్య సంబంధాల్లో సుంకాలను ఆయుధంగా ఉపయోగిస్తున్న తొలి నేత ట్రంపేనని భార్గవ విమర్శించారు. భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమెరికా (America)తో సహా ఇతర దేశాలతో కుదుర్చుకునే ఎఫ్‌టీఏ (FTA)లకు ప్రాతిపదికగా ఉండాలని భార్గవ స్పష్టం చేశారు. రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరాపై చైనా ఆంక్షలను ఒక హెచ్చరికగా తీసుకోవాలని కోరారు.