Dubai: గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టండి… దుబాయ్ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని, ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండో రోజు పర్యటనలో ఆయన యూఏఈకి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో పెట్టుబడి పెట్టాలని ప్రముఖ సంస్థ అపెక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చైర్మన్ ఖలీఫా కౌరీని కోరారు. బ్యాటరీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులపైనా చర్చించారు. హైకెపాసిటీ బ్యాటరీ స్టోరేజీ ద్వారా గ్రిడ్ డిమాండ్‌ను నిర్వహించేందుకు ఆస్కారం ఉందని అపెక్స్ ప్రతినిధులు ఆయనకు తెలిపారు. సూపర్ కెపాసిటర్స్ తయారీలోనూ అపెక్స్‌కు మంచి పేరుండడంతో ఏపీలో అందులోనూ పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
చంద్రబాబు ఆహ్వానాన్ని తప్పక పరిశీలిస్తామని, పెట్టుబడులు పెడతామని అపెక్స్ హామీ ఇచ్చింది. అపెక్స్ సూపర్ కెపాసిటర్ ఉత్పత్తులను రాష్ట్రానికి పంపాలని సీఎం కోరగా.. తప్పనిసరిగా పంపుతామని, సముద్రమార్గంలో వాటిని పంపుతామని చైర్మన్ ఖలీఫా తెలిపారు. ఆతిథ్య రంగంలోనూ ఈ సంస్థ ఉండడంతో అందులోనూ పెట్టుబడులకు చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం పునరుత్పాదక ఇంధన రంగంలో పేరొందిన మస్దార్ సంస్థ సీఈవో మొహమ్మద్ జమీల్ అల్ రమాహీతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ-మస్దార్ మధ్య భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. సౌర, పవన, గ్రీన్‌హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దిగ్గజ సంస్థ అగ్తియా గ్రూప్ సీఈవో సల్మీన్ అల్మేరీతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. హార్టీకల్చర్, ఆక్వా కల్చర్‌లో ఏపీలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్రంలో కోకో ఉత్పత్తి జరుగుతోందని.. చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అవసరమైన అపారమైన వనరులు ఏపీలో ఉన్నాయని, ఒకసారి పర్యటించాలని సీఎం విజ్ఞప్తి చేయగా.. అగ్తియా సీఈవో సానుకూలంగా స్పందించారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో జరిగిన సమావేశంలో.. ఏపీలో మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెడుతున్న పెట్టుబడులపై చర్చించారు. యూఏఈకి చెందిన సంస్థలతో ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు సహకరించాలని యూసఫ్ అలీని సీఎం కోరారు.







