Dubai: పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం… అబుధాబీ కంపెనీ ప్రముఖులతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తన యుఎఇ పర్యటనలో భాగంగా అబూధాబీలోని అల్ మైరాప్‌ా ఐలాండ్‌లోని ఏడీజీఏ స్క్వేర్‌లో అబూధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్‌తో ఆయన సమావేశమయ్యారు. దక్షిణాసియాలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీ.. ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో పెట్రో కెమికల్, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు అనువుగా ఉన్నట్లు తెలిపారు. సదరు కంపెనీ-ఏపీ మధ్య సాంకేతిక సహకారంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.
అనంతరం అబూధాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీతో, జీ42 సీఈవో మన్సూర్ అల్ మన్సూరీతోనూ సీఎం సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని వారికి తెలిపారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్న జీ 42 సంస్థను.. ఏఐ డేటాసెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.







