Nara Lokesh: మెల్ బోర్న్ లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో లో మంత్రి నారా లోకేష్
ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉంది
మాతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్
ఏపీకి 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది
విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది
విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
మెల్ బోర్న్(ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆరో రోజు.. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో మెల్ బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్ లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు ఆహ్వానించినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో మీ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు పరిగణించాలో మూడు ప్రధాన కారణాలు చెబుతాను. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రానికి ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. దీనివల్ల దేశంతో పాటు ఏపీలో కూడా సాఫీగా పెట్టుబడులు పెట్టేందుకు మీకు సహకారం లభిస్తుంది. ఏపీలో 50శాతం మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు ఉన్నారు. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు మేమంతా కసితో పనిచేస్తున్నాం.
మాతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్
రెండో కారణం.. ఏపీ స్టార్టప్ స్టేట్. చేపట్టిన పనులు పూర్తిచేయాలనే ధృడసంకల్పంతో ఉన్నాం. మీరు ఒకసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. మొదటగా మేం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆయా ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారులు, నాయకులతో నిరంతరం ప్రాజెక్ట్ పురోగతిపై రోజువారీ పద్ధతిలో చర్చిస్తాం. ప్రాజెక్ట్ ఏ దశలో ఉందో, ఏం చేయాలో తెలుసుకుంటాం. ఉదాహరణకు ఆతిథ్య సేవల రంగంలో ఈ రోజు ఉదయం ఓ కంపెనీకి భూమి కేటాయింపు ప్రస్తుత పరిస్థితి, ఫైల్ ఎక్కడ ఉందో, క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందో అన్న వివరాలు పంపించాం. ఇచ్చిన హామీని అమలుచేయడం మాకు చాలా ముఖ్యం. మీ ప్రాజెక్ట్ ను నిరంతరం ఫాలో అప్ చేస్తాం. మీరు నిర్దేశించిన సమయం కంటే వేగంగా పూర్తిచేయడమే మా లక్ష్యం.
ఏపీకి గూగుల్ సంస్థ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉంది
ఏపీకి గూగుల్ డేటా హబ్ గురించి అందరూ వినే ఉంటారు. దాని వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉంది. ఆ సంస్థ నాయకత్వం మొదట వచ్చినప్పుడు నేను స్వయంగా వాళ్లను తీసుకెళ్లి ప్రాజెక్ట్ వచ్చే స్థలాన్ని చూపించాను. తర్వాత నేను వారి కార్పోరేట్ కార్యాలయానికి వెళ్లి ఎందుకు ఏపీని ఎంచుకోవాలనే అంశంపై వారిని ఒప్పించాను. తర్వాత గూగుల్ నాయకత్వం వచ్చి ముఖ్యమంత్రి గారిని ఏపీలో కలిశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కొన్ని మార్పులు చేయాలని వారు కోరారు. ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారితో మాట్లాడి అవసరమైన విధానపరమైన సవరణలు చేశాం. దీంతో గూగుల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. భారతదేశం గ్లోబల్ డేటా సెంటర్ హబ్ గా ఎదిగేందుకు మార్గం సుగమమైంది. ఆ ప్రాజెక్ట్ ను మేం 13 నెలల్లోనే పూర్తిచేశాం. మేం చెప్పిన సమయం కంటే ఒక నెల మాత్రమే ఆలస్యమైంది. నెల ఆలస్యంపై ఇప్పటికీ మేం బాధపడుతుంటాం. ఆదిత్య మిట్టల్ గారు, నాకు మధ్య ఒక్క జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెల్లర్ మిట్టల్ ఏపీకి వచ్చింది. ఇందుకు కావాల్సిన అనుమతులపై ప్రధాని మోదీ గారితో చర్చించి మార్గం సుగమం చేశాం. నవంబర్ లో ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నాం. 15 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ ఏపీకి వ్చచింది.
ఏపీకి 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే
గత 16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. దేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ కు మేం మీ వెంటే ఉంటాం. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో మీ ప్రతి ఆలోచన, ప్రాజెక్ట్ కు మేం పూర్తి మద్దతు ఇస్తాం. మీ పెట్టుబడుల గమస్థానంలో ఏపీని ఎందుకు ఎంచుకోవాలనేందుకు మూడో కారణం.. మాది జాతీయ దృక్పథం కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీ. రెండు రాష్ట్రాల్లో ఉన్నాం. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ దేశ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం. దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా మేం ఎప్పుడూ జాతీయ విధానాలపై సానుకూల ప్రభావం చూపాం. ఈ ప్రక్రియలో ఏపీకి కూడా ప్రయోజనం లభించింది. గతంలో చంద్రబాబునాయుడు గారి హయాంలో కూడా టెలికాం, విమానయాన రంగం, డిజిటల్ చెల్లింపులు వంటి సంస్కరణల్లో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు డేటా సెంటర్ విధాన సంస్కరణల్లో కీలకపాత్ర పోషించారు.
ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం
ప్రస్తుత ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో చేయాల్సిన విధానపరమైన మార్పులు గుర్తించి, వాటిని అమలుచేసే పనిలో ఉన్నాం. ఇందుకు ఉదాహరణ కార్మిక సంస్కరణలు. 9 సంస్కరణల్లో మార్పులు చేయాలని సూచించారు. 8 సంస్కరణలను 15 రోజుల్లోనే మేం పూర్తిచేశాం. మేం ప్రస్తుతం 180 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం. దీనిని 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తీసుకెళ్తాం. మేం కేవలం ఒకటి, రెండు రంగాలపైనే దృష్టిపెట్టలేదు. 15 రంగాలపై దృష్టి కేంద్రీకరించాం. క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తాం. ఆటోమోటివ్, సిమెంట్, పునరుత్పాదక రంగం, ఎలక్టానిక్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఫార్మా, స్టీల్, ఆక్వా, క్వాంటం కంప్యూటింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాం. దేశంలో తయారవుతున్న ఏసీల్లో సగం ఏపీలోని తయారవుతున్నాయి. దీనిని 70శాతానికి తీసుకెళ్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా త్వరలోనే నెం.1 అవుతాం. మేం కేవలం ఎంవోయూల కుదుర్చుకోవడమే కాకుండా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషిచేస్తున్నాం. విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఇదో అద్భుతమైన నగరం. పార్ట్ నర్ షిప్ సమ్మిట్ క్ హాజరై పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలి. బెంగళూరు, గోవా నగరాల కలయిక విశాఖపట్నం. దేశంలోనే 9వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖ ఉంది. త్వరలోనే టాప్-3 లో నిలవనుంది. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) నేషనల్ ఛైర్ దీపక్ రాజ్ గుప్తా, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(మెల్ బోర్న్) డాక్టర్ సుశీల్ కుమార్, సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) డైరెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.







