Mosquitoes: ఐస్‌లాండ్‌లో దోమలు.. పోయేకాలం దగ్గర పడిందా..?
ప్రపంచంలో దోమలు (Mosquitoes) లేని అత్యంత అరుదైన ప్రదేశాలలో ఒకటిగా పేరొందింది ఐస్‌లాండ్ (Iceland). అయితే ఇప్పుడు ఆ ప్రత్యేక గుర్తింపును కోల్పోయింది. ఇటీవల దేశంలో తొలిసారిగా దోమలు కనిపించాయి. దీన్ని అధికారికంగా ధృవీకరించారు కూడా..! ఈ పరిణామం స్థానిక ప్రజలలో కలకలం రేపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్లే పర్యావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఐస్‌లాండ్‌లో కూడా దోమలు వచ్చేశాయని అంచనా వేస్తున్నారు.
కీటకాలపై ఆసక్తి ఉన్న బ్జోర్న్ హ్జల్టాసన్ అనే స్థానిక వ్యక్తి, ఈ నెలలో దోమలను తొలిసారిగా గుర్తించారు. రెడ్‌వైన్, చక్కెర పాకంలో ముంచిన బట్టలను ఉపయోగించి రైక్‌జావిక్ సమీపంలోని క్జోస్ లోయలో సీతాకోకచిలుకలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా ఈ సమయంలో ఆయన దోమలను గుర్తించారు. ఆయన రెండు ఆడ, ఒక మగ దోమలను సేకరించి, వాటిని ఐస్‌లాండిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హిస్టరీకి పంపారు.
కీటక శాస్త్రవేత్త మాథియాస్ ఆల్ఫ్రెడ్‌సన్ వీటిని పరిశీలించి, అవి శీతాకాలాన్ని సైతం తట్టుకుని జీవించగలిగే ‘కులిసెటా అనులాటా’ జాతికి చెందిన దోమలని నిర్ధారించారు. ఇవి ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలోని చల్లని ప్రాంతాలలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ప్రపంచంలో దోమలు లేని చివరి కోట కూలిపోయిందని ఈ ఆవిష్కరణ తరువాత హ్జల్టాసన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. దీంతో దోమలు లేని ఏకైక ప్రాంతంగా ఇప్పుడు అంటార్కిటికా మాత్రమే మిగిలింది.
ఐస్‌లాండ్‌లో దోమలు లేకపోవడానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణం. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందడానికి, గుడ్లు పెట్టడానికి స్థిరమైన, వెచ్చని వాతావరణం అవసరం. ఐస్‌లాండ్‌లో సాధారణ ఉష్ణోగ్రతలు 10-15°C మధ్య ఉంటాయి, ఇది దోమలకు అనుకూలం కాదు. ఐస్‌లాండ్‌లో నీరు తరచుగా గడ్డకట్టడం, కరగడం జరుగుతూ ఉంటుంది. దోమల జీవిత చక్రం పూర్తి కావడానికి స్థిరమైన నీరు అవసరం, కానీ ఈ వేగవంతమైన చక్రం వాటి పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది.
దోమలు ఎందుకు వచ్చాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా రెండు అంశాలను పరిశీలిస్తున్నారు. అందులో ఒకటి వాతావరణ మార్పులు. ఐస్‌లాండ్ మిగిలిన ఉత్తరార్ధగోళం కంటే నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో వరుసగా 10 రోజుల పాటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటింది. ఒక ప్రాంతంలో ఏకంగా 26.6 డిగ్రీల సెంటిగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ అసాధారణమైన వెచ్చని వాతావరణమే దోమల మనుగడకు అనుకూల పరిస్థితులను సృష్టించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక రెండో కారణం ఓడలు. ఈ దోమలు ఓడలు లేదా అంతర్జాతీయ కంటైనర్ల ద్వారా దేశంలోకి ప్రవేశించి ఉండవచ్చని హ్జల్టాసన్, ఆల్ఫ్రెడ్‌సన్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా విమానాలలో దోమలు చేరుకున్న దాఖలాలు ఉన్నాయి, కానీ అవి బయట జీవించగలిగినట్టు నిర్ధారణ కాలేదు.
‘కులిసెటా అనులాటా’ జాతి దోమలు సాధారణంగా ప్రాణాంతక ఉష్ణమండల వ్యాధులను అంటే డెంగ్యూ, మలేరియా వంటి వాటిని వ్యాప్తి చేయవు. అయినప్పటికీ, ఐస్‌లాండ్‌లో దోమలు దర్శనమీయడం ఆందోళన కలిగిస్తోంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ దోమల జాతి ఐస్‌లాండ్‌లో స్థిరమైన జనాభాను ఏర్పరచుకుందా లేదా అని పర్యవేక్షించనున్నారు. వచ్చే వసంతకాలంలో మరిన్ని దోమలు కనిపిస్తే, అవి అక్కడ స్థిరపడినట్టు నిర్ధారించవచ్చు. ఈ పరిణామం ఐస్‌లాండ్‌లోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని సూచిస్తుంది.







