గూగుల్ మ్యాప్స్ కు ప్రత్యామ్నాయంగా ఇస్రో
మనం ఎక్కడికైనా వెళ్తే రూట్ తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్..ఏదైనా ప్రదేశాన్ని ఇంటర్నెట్లో వెతకాలంటే గూగుల్ మ్యాప్స్. దైనందిన కార్యక్రమాల్లో గూగుల్ మ్యాప్స్ ఒక భాగమైపోయింది. ఈ కారణంగానే అనేక కంపెనీలు గూగుల్ సహకారంతో మనం ఉన్న లొకేషన్‌ను బట్టి ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ మన సమచారాన్ని కంపెనీలకు ఇస్తున్నది. ఇది వ్యక్తిగత సమాచార భద్రతకు ఎంతో ముప్పు. అందుకే గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తి స్వేదేశీ సాంకేతికతతో భారతీయులకు నావిగేషన్, మ్యాప్స్ సేవలను అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), మ్యాప్ మై ఇండియా జతకట్టాయి. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ (డీవోఎస్), మ్యాప్ మైౖ ఇండియా మాతృసంస్థ సీఈ ఇన్పో సిస్టమ్స్‌తో ఒప్పందం కుదిరినట్టు ఇస్రో వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగినట్టు మ్యాప్ మై ఇండియా సీఈవో రోహణ్ వర్మ చెప్పారు. స్వదేశీ నావిగేషన్ సేవల్లో ఈ ఒప్పందం మైలు రాయి అని అభివర్ణించారు. మ్యాప్ మై ఇండియా సంస్థ బాధ్యతాయుతమైన, స్థానిక కంపెనీ. దేశసార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాపులను రూపొందించగలదు. భారత ప్రభుత్వం ప్రకారం సరిహద్దులను సూచించగలదు అని అన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం మ్యాప్ మై ఇండియాలో ఉన్న డిజిటల్ మ్యాపులను, ఇస్రో ఉపగ్రహ చిత్రాలతో సమన్వయం చేసి మ్యాపులను, నావిగేషన్ సేవలను ప్రత్యేక పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కలయికతో మ్యాప్ మై ఇండియా యూజర్లు ఇస్రో ఉపగ్రహాల సమాచారంతో మరింత సృష్టంగా మ్యాపులను పొందవచ్చు. నావిగేషన్ ఉప్రగహం ఐఆర్ఎన్ఎస్ఎస్ ద్వారా నావిగేషన్ సేవలు లభిస్తాయి.






