కేవలం రూ. 20తో ఏకంగా రూ. 2 లక్షల బీమా.. మోదీ సర్కార్ స్కీమ్స్ బంపర్ హిట్!
సామాన్యుడికి అనుకోని ఆపద వస్తే ఆదుకునేదెవరు? ప్రైవేట్ బీమా కంపెనీల వైపు వెళితే వేలకు వేలు ప్రీమియం కట్టాలి. కానీ కేవలం ఒక టీ తాగే ఖర్చుతో పేదవాడికి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకాలు (Govt Schemes) ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్న ఈ పథకాలు విజయవంతంగా 11 వసంతాలు (2015-2026) పూర్తి చేసుకున్నాయి.
అకౌంట్లలోకి రూ. 25 వేల కోట్లు:
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) పథకాలు దేశంలో అద్భుత విజయం సాధించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకాలు (Govt Schemes) ప్రారంభించి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధిదారులకు ఏకంగా రూ. 25,160 కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించి, ఆ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. అతి తక్కువ ప్రీమియంతో కోట్లాది మంది అభాగ్యులకు ఇంతటి భారీ బీమా, పెన్షన్ రక్షణ అందించడమే ఈ పథకాల వెనుక ఉన్న అసలైన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.
వార్షిక ప్రీమియం తక్కువే..
ఈ మూడు పథకాలు (Govt Schemes) సామాన్యుడి జీవితానికి ఎలా రక్షణ కల్పిస్తున్నాయో చూస్తే ఆశ్చర్యపోక మానరు:
ఇవి కూడా చదవండి
పీఎంఎస్బీవై (PMSBY): ఈ ప్రమాద బీమా పథకంలో సంవత్సరానికి కేవలం రూ. 20 చెల్లిస్తే చాలు.. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా ఏకంగా రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది.
పీఎంజేజేబీవై (PMJJBY): ఈ జీవిత బీమా పథకంలో సంవత్సరానికి రూ. 436 ప్రీమియంతో (అంటే నెలకు రూ. 36 చొప్పున) లబ్ధిదారుడికి రూ. 2 లక్షల లైఫ్ కవర్ పొందవచ్చు.
అటల్ పెన్షన్ యోజన (APY): అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆధారంగా నిలిచే ఈ స్కీమ్‌లో చేరితే.. 60 ఏళ్ల వయసు తర్వాత వారి కాంట్రిబ్యూషన్‌ను బట్టి నెలకు రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 5,000 వరకు ప్రతి నెలా కచ్చితమైన పెన్షన్ గ్యారెంటీగా లభిస్తుంది.
రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు..
ఈ 11 ఏళ్ల ప్రయాణంలో సామాన్య ప్రజలు ఈ పథకాలకు (Govt Schemes) బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు పీఎంఎస్‌బీవైలో ఏకంగా 58 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరగ్గా.. పీఎంజేజేబీవైలో 27 కోట్లు, అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మందికి పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు. విశేషమేమిటంటే, ఇందులో మహిళల భాగస్వామ్యం అత్యధికంగా పెరగడం. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘డిజిటల్ జన సురక్ష పోర్టల్’ రాకతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరింత సులభతరం కావడమే కాకుండా.. కష్టకాలంలో క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఆన్లైన్లోనే వేగంగా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా జరిగిపోతోందని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి






