Foreign Reserves: ఆల్‌టైం గరిష్ఠానికి భారత విదేశీ మారక నిల్వలు..!
భారత ఆర్థిక వ్యవస్థకు మరో అరుదైన రికార్డు అందుకుంది. దేశ విదేశీ మారకపు నిల్వలు (Foreign Reserves) ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ నెల 13తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 8.66 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో మొత్తం నిల్వల విలువ 725.72 బిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ. 66 లక్షల కోట్లు) చేరుకుంది.
ఎందుకు పెరిగాయంటే..?
గత నెలలో 723.77 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న మునుపటి రికార్డును అధిగమిస్తూ భారత్ ఈ ఘనత సాధించింది. ఈ వారం పెరిగిన నిల్వల్లో (Foreign Reserves) విదేశీ కరెన్సీ ఆస్తులు 3.55 బిలియన్ డాలర్లు కాగా, బంగారం నిల్వలు (Gold Reserves) 4.99 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) 103 మిలియన్ డాలర్లు, ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలు 19 మిలియన్ డాలర్లు వృద్ధి చెందాయి. అంతకుముందు వారం 6 బిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ, తాజా వృద్ధి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చాటిచెప్పింది.
ఇవి కూడా చదవండి
మెరుగుపడిన పెట్టుబడిదారుల సెంటిమెంట్..
భారత్-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాల తర్వాత అంతర్జాతీయ పెట్టుబడిదారులలో నమ్మకం పెరిగింది. ఫలితంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPI) వెల్లువెత్తడం, భారత రూపాయి పుంజుకోవడం వంటి పరిణామాలు ఫారెక్స్ నిల్వలు (Foreign Reserves) పెరగడానికి దోహదపడ్డాయి.
ఏడాది పాటు దిగుమతులకు భరోసా..
ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఈ నిల్వలు (Foreign Reserves) దేశానికి ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేయనున్నాయి. ఇవి దాదాపు ఏడాది కాలానికి సరిపడా దిగుమతులకు, బయటి రుణాలలో సుమారు 96 శాతాన్ని కవర్ చేయడానికి సరిపోతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత్ ఇంతటి భారీ నిల్వలను కలిగి ఉండటం దేశ ఆర్థిక భవిష్యత్తుకు శుభసూచకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

















