ప్రపంచంలోనే భారత్ కు రెండో స్థానం…
స్మార్ట్ఫోన్లపై భారతీయులు వెచ్చిస్తున్న సగటు సమయం ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా ఉన్నట్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. దేశంలో తక్కువ నిడివి గల వీడియోలు చూస్తున్న సమయం 2025 నాటికి నాలుగు రెట్లు పెరగనుందని పేర్కొంది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్-2021 నివేదిక ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మరోవైపు భారత్‌లో గడిచిన ఐదేళ్లలో డేటా వినియోగం 60 రెట్లు పెరిగినట్లు తాజా అధ్యయనం సృష్టం చేసింది. ఈ స్థాయిలో పెరుగుదల నమోదుకావడం ప్రపంచంలోనే అత్యధికమని నోకియా మార్కెటింగ్ చీఫ్ అమితా మార్వా అన్నారు.
2015లో దేశవ్యాప్తంగా 164 పెటా బైట్ల డేటా వినియోగించగా డిసెంబర్ 2020 నాటికి అది 10 వేల పెటా బైట్లకు చేరినట్లు తెలిపారు. ఒక వ్యక్తి నెలవారీ సగటు డేటా వినియోగం గడిచిన ఐదేళ్లలో 76 శాతం మేర పెరిగినట్లు అమిత్ మార్వా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఒక వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌పై వెచ్చించే సమయం 4 రెట్లు పెరిగింది. ఓ వ్యక్తి సగటున రోజులో 5 గంటలు మొబైల్ ఫోన్‌కు అతుకుపోతున్నట్లు తేలింది.






