మన దేశానికి అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో, మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. చైనా రెండో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ అనిశ్చితిలో ఎగుమతులు, దిగుమతులు తగ్గిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్`సెప్టెంబరులో 59.67 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.4.95 లక్షల కోట్లు)గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో జరిగిన 67.28 బి.డాలర్ల (సుమారు రూ.5.58 లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 11.3 శాతం తక్కువ. ఈ సమయంలో అమెరికాకు మన ఎగుమతులు 25.79 బి.డాలర్ల నుంచి 21.39 బి.డాలర్లకు తగ్గాయి. ఇదే సమయంలో భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 3.56 శాతం తగ్గి 58.11 బి.డాలర్లకు పరిమితమైంది. చైనాకు మన ఎగుమతులు 7.84 బి.డాలర్ల నుంచి 7.74 బి.డాలర్లకు తగ్గితే, అక్కడి నుంచి దేశంలోకి దిగుమతులు కూడా 52.42 బి.డాలర్ల నుంచి 5047 బి.డాలర్లకు తగ్గాయి.






