Accenture: ఏఐ నేర్చుకోకుంటే ప్రమోషన్లు ఉండవు.. తేల్చేసిన యాక్సెంచర్!
టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ (AI) విప్లవం పని సంస్కృతిని వేగంగా మార్చేస్తోంది. కేవలం జూనియర్లే కాదు, సీనియర్ స్థాయి ఉద్యోగులు కూడా ఏఐని అందిపుచ్చుకోవాలని దిగ్గజ సంస్థలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ (Accenture) తన సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. కృత్రిమ మేధ సాధనాలను (AI Tools) నిత్యం ఉపయోగించే వారికి మాత్రమే భవిష్యత్తులో లీడర్షిప్ రోల్స్, ప్రమోషన్లు లభిస్తాయని స్పష్టం చేసింది.
ప్రమోషన్ కావాలంటే ఏఐ రావాల్సిందే..
యాక్సెంచర్ (Accenture) తన సీనియర్ సిబ్బందికి పంపిన అంతర్గత మెయిల్స్‌లో.. పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఏఐ టూల్స్ వాడకం తప్పనిసరని పేర్కొంది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడితే, కెరీర్ ఎదుగుదల ఆగిపోతుందని సంకేతాలిచ్చింది. ఇప్పటికే ఏఐ వల్ల ప్రభావితమైన సుమారు 11 వేల మంది ఉద్యోగులను యాక్సెంచర్ తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు సీనియర్లకు ఈ అల్టిమేటం ఇవ్వడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులను రీ-స్కిల్లింగ్ (Re-skilling) చేయడమే లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలోనే..
కేవలం యాక్సెంచర్ (Accenture) మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. గూగుల్ (Google) ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసి, ఏఐ ప్రణాళికలకు అనుగుణంగా మారలేని వారు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయవచ్చని సూచించింది. ఇందుకోసం ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీలను కూడా ఆఫర్ చేసింది. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఇదే తరహా ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ తన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.
మొత్తానికి టెక్ రంగంలో మనుగడ సాగించాలంటే కేవలం అనుభవం ఉంటే సరిపోదని, ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడం అత్యవసరమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ప్రమోషన్లు పొందాలంటే ఇకపై ఏఐ నైపుణ్యం తప్పనిసరి కానుంది.
ఇవి కూడా చదవండి

















