GST : డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు .. జీఎస్‌టీతో చెక్

కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న జీఎస్‌టీ (GST) సంస్కరణలు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాల ప్రభావాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ బీఎంఐ (BMI) తెలిపింది. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మార్కెట్ ఎకానమీల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. సుంకాలతో కొన్ని రంగాలు దెబ్బతినే అవకాశం ఉందని, భారత జీడీపీ వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉంటుందని బీఎంఐ అంచనా వేసింది. రానున్న కాలంలో ఉత్పాదకత 5 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది జీడీపీ (GDP) వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొంది. జీఎస్‌టీ సంస్కరణలు వృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను తొలగిస్తాయని, ఈ అంశంలో ఇప్పటికే ఉన్న అంచనాలు వృద్ధికి దోహదం చేసేలా ఉన్నాయని భావిస్తున్నట్లు బీఎంఐ తెలిపింది. దీపావళి (Diwali) నుంచి జీఎస్‌టీ లో నాలుగు శ్లాబులు బదులు రెండే శ్లాబులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శ్లాబుల స్థానంలో 5, 18 శాతం జీఎస్‌టీ ఉండనున్నాయి. వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం జీఎస్‌టీలో మార్పులు చేస్తోంది.