సిమెంట్ తయారీలో సరికొత్త విప్లవం.. పర్యావరణ హితమే లక్ష్యంగా గ్రీన్ సిమెంటెక్ సదస్సు!
Green Cementech: పర్యావరణానికి మేలు చేసేలా సిమెంట్ తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ‘గ్రీన్ సిమెంటెక్ 2026’ సదస్సు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వార్షిక సదస్సు 22వ ఎడిషన్ గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో మొదలైంది. గ్రీన్ బిజినెస్ సెంటర్ (CII-GBC), సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CMA) సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 400 మంది పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు , శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
నెట్ జీరో కార్బన్ దిశగా అడుగులు..
సదస్సు ప్రారంభోత్సవంలో అల్ట్రాటెక్ సిమెంట్ బిజినెస్ హెడ్ ఈఆర్ రాజ్ నారాయణన్ ప్రసంగిస్తూ.. ‘నెట్ జీరో కార్బన్ వైపు ప్రయాణం’ అనే ప్రధాన లక్ష్యంతో భారతీయ సిమెంట్ రంగం నేడు సరైన దిశలో ముందుకు సాగుతోందని, ఇది సుస్థిరమైన ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి గట్టి పునాది వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ వేదిక డీకార్బనైజేషన్, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై వ్యూహాత్మక చర్చలకు వేదికవుతోందని పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణలో నూతన సాంకేతికతలు..
ఐజీబీసీ నేషనల్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే పదార్థాల వాడకం అత్యవసరమన్నారు. రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ సీఈఓ మసూద్ మల్లిక్ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచాలని, వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాలని సూచించారు. కాలుష్య నియంత్రణలో పరిశ్రమల మధ్య సమన్వయం , భాగస్వామ్యాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎంఏ సెక్రటరీ జనరల్ అపర్ణ దత్ శర్మ వివరించారు.
సదస్సులో ప్రధాన ఆకర్షణలు..
ఈ కార్యక్రమంలో ‘కార్బన్ క్యాప్చర్’ సాంకేతికతలపై రూపొందించిన ప్రత్యేక ప్రచురణను ఆవిష్కరించారు. అలాగే 50 మందికి పైగా ఎగ్జిబిటర్లతో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ఇంధన సామర్థ్యం, స్మార్ట్ తయారీకి సంబంధించిన అత్యాధునిక పరిష్కారాలను ప్రదర్శించారు. సిమెంట్ పరిశ్రమలో డిజిటల్ మార్పులు , తక్కువ కార్బన్ ఉద్గారాల లక్ష్యంతో సాగుతున్న ఈ గ్రీన్ సిమెంటెక్ సదస్సు మే 15న మరిన్ని సాంకేతిక సెషన్లు, నాయకత్వ చర్చలతో ముగియనుంది.






