లేఆఫ్స్ ఫీవర్.. భయాందోళన ఉద్యోగులు

దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్స్ వరకు ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. హద్దులు లేకుండా పోతున్న లేఆఫ్స్ ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ కంపెనీలు కూడా ఉద్యోగుల తొలగింపులు చేపడుతునన్నాయి. ఐటీ దిగ్గజం గూగుల్ 2023లో వేలాది మంది సిబ్బందికి ఉద్వాసన పలికింది. తాజాగా దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగుల భయాన్ని రెట్టింపు చేసింది. తమ కంపెనీలలో తొలగింపులు 2024లో కూడా ఓ క్రమ పద్ధతిలో కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఉద్యోగుల్లో ఒకింత అభద్రతా భావం ఏర్పడిరది. ఎప్పుడు ఎవరిని ఉద్యోగం నుంచి తొలగిస్తారోనని భయపడుతున్నారు. టెక్ దిగ్గజం అభివృద్ధి వేగాన్ని మెరుగుపరచడానికి శ్రామిక శక్తిని తగ్గించడం కొనసాగిస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు.
ఉద్యోగుల్లో భయాందోళనలను పోగొట్టడానికి ఇటీవల కంపెనీ ఆల్ హ్యాండ్స్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు సిబ్బంది సంధించిన ప్రశ్నలకు పిచాయ్ సమాధానం ఇచ్చారు. వర్క్ ఫోర్స్‌ను మరింత తగ్గించాలనే కంపెనీ ఉద్దేశాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సవివరంగా తెలియజేశారు. అయితే ఈ ఏడాది చివరి అర్ధభాగంలో లేఆఫ్స్ ప్రభావం తక్కువగా ఉంటుందని హామీ ఇచ్చారు.