ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ

ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 2022లోనే ఆసియాలో నంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగారు. అంతే కాదు స్వల్ప సమయం పాటు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిల్చారు. 2023 జనవరిలో అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పరిణామాలతో గ్రూప్ సంస్థల షేర్లన్నీ కుదేలై ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు.