రూ.10 వేల బిల్లుకు… రూ.1.46 లక్షల టిప్
ఇరవై ఏండ్లుగా తాము విజిట్ చేసే రెస్టారెంట్ సిబ్బందికి ఓ జంట ఏకంగా 2000 డాలర్ల టిప్ ఇవ్వడంతో సర్వర్లు ఉబ్బితబ్బిబయ్యారు. చికాగోకు చెందిన ఈటరీ క్లబ్ లక్కీ సోషల్ మీడియాలో జంట ఉదారతను నెటిజన్లతో పంచుకుంది. ఇరవై ఏండ్ల కిందట ఈ జంట ఇదే రెస్టారెంట్లో పరిచయమై ఈటరీ క్లబ్ వేదికగా ఒక్కటైంది. రెండు దశాబ్ధాల కిందట ఈ గెస్ట్ ఫిబ్రవరి 12న రెస్టారెంట్లో పరిచయమైన మహిళతో డేట్ చేసి ఆపై భార్యగా మారిన ఆమెతో ప్రతి ఏటా ఇదే రోజు రాత్రి 7:30కు రెస్టారెంట్‌కు వస్తారని వారిద్దరికీ టేబుల్ నెంబర్ 46ను రిజర్వ్ చేశామని ఫేస్బుక్ పోస్ట్‌లో ఈటరీ క్లబ్ లక్కీ పేర్కొంది. వారి జీవితంలో తాము ప్రత్యేక భాగమవడం సంతోషకరమని, వారి ఔదార్యానికి తాము ముగ్ధులయ్యామని తెలిపింది.
కరోనా మహమ్మారి వెంటాడుతున్న ఈ సంక్లిష్ట సమయంలో వారు చూపిన ఆప్యాయత తమ సిబ్బందిలో స్ఫూర్తి నింపిందని పేర్కొంది. బిల్లు రసీదుపై ఆ జంట ఆప్యాయత రంగరించి రాసిన పదాలతో కూడిన ఫోటోనూ పోస్ట్‌లో జతచేసింది. ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది. ఏండ్ల తరబడి రెస్టారెంట్‌తో తమకున్న అనుబంధాన్ని అక్కడి సిబ్బంది పట్ల జంట ప్రదర్శించిన ఆప్యాయతనూ నెటిజన్లు ప్రశంసించారు. వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. రెస్టారెంట్ సిబ్బందికి వారిచ్చిన బహుమతి అద్భుతమని ఓ యూజర్ కామెంట్ చేయగా, వారి ఔదార్యం వెలకట్టలేనిదని మరో యూజర్ రాసుకొచ్చాడు. ఒక జంట సర్వర్లకు ఇచ్చిన టిప్‌ను క్లబ్ లక్కీ సిబ్బంది అందరికీ పంచామని రెస్టారెంట్ యజమాని జిమ్ హిగ్గిన్స్ తెలిపారు.






