ముఖ్యమంత్రి కుమార్తెకు షాక్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత సైబర్ మోసం బారిన పడ్డారు. ఓ వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడంతో ఆమె ఖాతా నుంచి రూ.34 వేలు మాయమయ్యాయి. ఇ-కామర్స్ వేదిక ఓఎల్ఎక్స్ లో హర్షిత ఓ సోఫాను అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారుడిగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఆమెను పరిచయం చేసుకున్నాడు. సోఫా కొనేందుకు ఆసక్తి చూపాడు. బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని స్వల్ప మొత్తాన్ని ఆమెకు బదిలీ చేశారు. అనంతరం ఓ క్యూఆర్ కోడ్ను పంపి దాన్ని స్కాన్ చేస్తే డబ్బు ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడు. హర్షిత దాన్ని స్కాన్ చేయగా అతడి నుంచి డబ్బు రాకపోగా, ఆమె ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. ఆపై అతణ్ని మళ్లీ సంప్రదించగా.. తాను పొరపాటున వేరే క్యూఆర్ కోడ్ను పంపినట్లు చెప్పారు. మరో కోడ్ను పంపి దాన్ని స్కాన్ చేయాలని సూచించాడు. అతడు చెప్పినట్లే చేయడంతో హర్షిత ఖాతా నుంచి మరో 14 వేలు బదిలీ అయ్యాయి. ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






