Air India : ఎయిరిండియా విమానాల్లో వారికి టికెట్‌పై రాయితీ

తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు ఎయిరిండియా(Air India) బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తలకు టికెట్ ధరపై రాయితీ ప్రకటించింది. అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ మూల ధరపై 10శాతం వరకు, దేశీయ సర్వీసుల్లో అయితే 25శాతం వరకు రాయితీ ఇస్తామని వెల్లడించింది. ఎకనామీ, బిజినెస్ క్లాస్ (Business Class) సహా అన్ని రకాల టికెట్లపై ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ రాయితీ పొందాలంటే ఎయిరిండియా వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుకింగ్ అప్పుడే కన్‌సెషన్ టైప్ దగ్గర సీనియర్ సిటిజన్ కోటాను తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి. ఈ రాయితీతోపాటు సాధారణం కంటే 10 కిలోల వరకు అదనపు లగేజీని సీనియర్ సిటిజన్లు తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఎయిరిండియా ఇస్తుంది. అంతేకాక, సీనియర్ సిటిజన్లు (Senior Citizen) తమ ప్రయాణ తేదీని ఓసారి ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. అయితే, మార్పు చేసుకున్న ప్రయాణ తేదీలో టికెట్ ధర అధికంగా ఉంటే మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ప్రజలు వారి గుర్తింపు కార్డును అనుసరించి వయసును నమోదు చేయాలని తెలిపారు. వీటిలో ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు (Passport) , డ్రైవింగ్ లైసెన్సు(Driving License) , ఎయిరిండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని తెలిపారు.