ASBL NSL Infratech

ఏపీలో హింసాత్మక ఘటనల వెనక ఉన్నదెవరు..?

ఏపీలో హింసాత్మక ఘటనల వెనక ఉన్నదెవరు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్శ్వం కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయన్నది పక్కనపెడితే, పోలీసింగ్ వ్యవస్థ మాత్రం నీరుగారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పోలీసులను రాజకీయ పార్టీల నేతలు పట్టించుకోవడం మానేశారన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే పోలీసులను అధికార పార్టీ తమ వారిగా భావిస్తుంటే.. విపక్షం కూడా తమ వ్యతిరేక వర్గానికి అండగా ఉంటున్నారని ఆరోపిస్తూ వస్తోంది. దీంతో తమ లెక్కలు తామే తేల్చుకోవాలన్న పట్టుదల పార్టీల కార్యకర్తల్లో కనిపిస్తోంది.

సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగింది. ఓ ముఖ్యమంత్రిపై నేరుగా దాడి జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే చిన్నదాడి కాబట్టి, సరిపోయింది. కానీ ఇక్కడే ఓప్రశ్న ఉత్పన్నమైంది. సీఎంకు భారీ భద్రత ఉన్నప్పటికీ దాడి ఎలా జరిగిందన్నది తేలాల్సి ఉంది. అయితే ..దీన్ని అధికార, విపక్షాలు తమ దైన శైలిలో భాష్యం చెప్పుకుంటూ పోతున్నాయి. మరోవైపు..విపక్ష నేతల సభల్లోనూ రాళ్లు పడుతున్నాయి . అయితే వారికి తగలలేదు కాబట్టి హడావుడి లేకుండా పోయింది. లేదంటే అది మరో రాజకీయమయ్యేది.

హోం మంత్రి తానేటి వనిత పై టీడీపీ నేతలు దాడికి పాల్పడడం ...రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి నాడు గోపాలపురం నల్లజర్ల లో టీడీపీ శ్రేణులు హోమ్ మంత్రిపై దాడికి తెగబడ్డాయి. స్థానికంగా ప్రచారం ముగించుకొని విశ్రాంతి తీసుకోవడానికి మాజీ జడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి హోం మంత్రి తానేటి వనిత చేరుకునే సమయానికి.... టీడీపీ, వైసీపీ మధ్య గొడవ తారస్థాయికి చేరింది. దీంతో టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశాయి. ఫలితంగా గొడవ తానేటి వనితపై దాడి వరకు వెళ్ళింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తు చేస్తున్నారు..

అంతవరకూ ఎందుకు పవన్ కు మద్దతుగా పిఠాపురంలో పర్యటించిన మెగా కాంపౌండ్ హీరో పైనా బాటిల్స్ విసిరిన ఘటన చోటు చేసుకుంది. ఎందుకిలా జరుగుతోంది. కావాలనే విసురుతున్నారా..? లేదా తమ నేతకు వ్యతిరేకంగా ఎవరూ ఉండొద్దన్న భావన దీనికి కారణమవుతోందా..? ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. కోడికత్తి శ్రీనును చూస్తేనే అర్థమవుతుంది. ఓసారి జైల్లో పడిన తర్వాత బయటకు రావడానికి నానా కష్టాలు పడ్డాడు. సంవత్సరాలు జైల్లోనే గడిచిపోయాయి. వారి కుటుంబం పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. అయినా అభిమానం ముందు కుటుంబం లెక్కలోకి రాకపోవడం బాధాకరం..

ఈపరిస్థితికి పక్కాగా చెప్పాలంటే ప్రస్తుతమున్న అధికార, విపక్ష పార్టీల నేతలే కారణమని చెప్పొచ్చు. వారు వ్యక్తిగతంగానూ విమర్శలకు దిగడం, కేడర్ ను ఉత్తేజపరుస్తుండడం... దాడులకు కారణాలుగానూ కనిపిస్తోంది. గతంలో దశాబ్దాల తరబడి జరిగిన రాజకీయ పోరాటంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎందుకంటే అప్పుడు రాజకీయ నేతల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేది. ఇప్పుడు అదికాస్త రాజకీయ పోరాటంగా మారింది. చావో, రేవో అన్నట్లు తయారైన ప్రస్తుత పరిస్థితుల్లో క్యాడర్ కూడా అదే రీతిలో స్పందిస్తుండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :