ASBL NSL Infratech

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో తడబడిన వైసీపీ..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో తడబడిన వైసీపీ..

అన్నీ తెలిసిన వాడికి చెప్పవచ్చు.. ఏమీ తెలియని వాడికి కూడా చెప్పవచ్చు.. కానీ అన్ని తెలుసు అనుకునే వాడితో మనం వాదించలేము. ప్రస్తుతం ఆంధ్రలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరిస్థితి ఇలాగే ఉంది. టెస్టింగ్ దశలో ఉండే యాక్ట్ కాస్త ఇప్పుడు ఆంధ్రలో నాయకుల ఎన్నికల రిజల్ట్ టెస్ట్ చేసే రేంజ్ కు ఎదిగిపోయింది. ఇంకా పూర్తిగా ఏర్పడని యాక్ట్ కాబట్టి దీనిపై ఎన్నో అనుమానాలు ఉండడం సహజమే. కానీ అవేమీ పరిష్కరించకుండా.. అధికార పార్టీ ఎన్నికల టైం కి లేని సమస్య నెత్తిన తెచ్చి పెట్టుకుంది. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై గత కొంతకాలంగా రగడ జరుగుతుంది. లాయర్లు ఈ చట్టం గురించి సమ్మె చేసిన ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. అదే ఇప్పుడు పెద్ద పొరపాటుగా మారింది. అధికారుల అత్యుత్సాహమో.. సంబంధిత మంత్రుల స్వామి భక్తో తెలియదు కానీ.. రైతుల పాస్ పుస్తకాల పైన.. పొలం సరిహద్దు రాళ్లపైన జగన్ బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. ఇది ప్రతిపక్షం చేతిలో అస్త్రంగా మారింది. వీటిని చూపించి ప్రజలలో అభద్రత భావం సృష్టించి రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

మన ఆస్తి పత్రాలు మన దగ్గర ఉన్నప్పుడు.. భూమిని ప్రభుత్వం ఎలా కాజేస్తుంది.. అలా రాష్ట్ర ప్రభుత్వం అమాయకపు ప్రజల భూములు కాజేస్తే కేంద్రం ఊరుకుంటుందా.. ఈ చిన్న లాజిక్ ఆంధ్రాలో ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే అసలు ఈ యాక్ట్ గురించి చాలామందికి నిన్న మొన్నటి వరకు అవగాహన కూడా లేదు. అధికార పార్టీ ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అసలు ఈ చట్టం ఏమిటి? దీనివల్ల ప్రజలకు ఎటువంటి మంచి కలుగుతుంది? ఈ చట్టంతో ఉన్న ఇబ్బందులు ఏమిటి? అసలు ఇది ఎవరికీ వర్తిస్తుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు ముందుగానే సమాధానం ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. 

ప్రచారం కోసం కోట్లు ఖర్చుపెట్టిన అధికార పార్టీ ఈ యాక్ట్ సంబంధించిన విషయాలను సామాన్యుడు కూడా అర్థం చేసుకునే విధంగా న్యూస్ పేపర్లో ఫుల్ పేజీ ప్రకటన ఇవ్వాల్సింది. ఎలాగో గడపగడపకు మన ప్రభుత్వం అని నాయకులు చాలావరకు ప్రతి ఇంటికి వెళ్లారు. అదే సందర్భంలో దీని గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పవలసింది. అదే చేసి ఉంటే ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్సలు చాన్స్ దొరికేది కాదు. కింద స్థాయిలో ఈ చట్టంపై ప్రజలలో తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికార పార్టీ ఈ విషయంపై స్పందించి చర్యలు చేపట్టకపోతే తీవ్రనష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :