ASBL NSL Infratech

వైసీపీకి ముద్రగడ బలమా..? బలహీనతా...?

వైసీపీకి ముద్రగడ బలమా..? బలహీనతా...?

ముద్రగడ పద్మనాభం స్టెప్స్..వైసీపీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటివరకూ తటస్థుడిగా ఉన్న సమయంలో ముద్రగడ వల్ల ఫ్యాన్ కు కాస్త లాభమే చేకూరింది. కానీ ఇప్పుడు మాత్రం ముద్రగడతో మునుగుతున్నామన్న ఆందోళన వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా పవన్ పై ముద్రగడ వ్యాఖ్యలు..కాపు సామాజికవర్గాన్ని ఏకం చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సామాజికవర్గమంతా కూటమివైపు కదులుతున్న సూచనలున్నాయన్నది వైసీపీ నేతల ఆఫ్ ద టాక్ గా వినిపిస్తోంది.

పవన్ ను పిఠాపురం నుంచి గెలవనివ్వమని.. ఇక్కడి నుంచి తన్ని పంపేయకపోతే, తన పేరు మార్చుకుంటానన్న ముద్రగడ వ్యాఖ్యలకు.. కాపు సామాజిక వర్గంలో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంతైనా ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయిన పవన్ ను అంతమాట అనడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కడికో అక్కరలేదు.. సాక్షాత్తూ ముద్రగడ కుటుంబంలోనే ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమైంది. ముద్రగడ కూతురు .. తండ్రివ్యాఖ్యల్ని తప్పుపట్టారు.

కొన్నేళ్లుగా కాపు ఉద్యమనేత అన్న సానుభూతి తప్ప ముద్రగడకు పెద్దగా బలం ఉన్నట్లు కనిపించలేదు. కాస్త సామాజిక వర్గం ఓట్లు పడతాయన్న ఆశతో చాలా మంది కాపునేతలు... ముద్రగడ ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ వస్తోంది. అంతేకానీ.. ఆఓట్లతోనే గెలిచేస్తామన్నది కాదు. అయితే వాటిని చూసుకుని ముద్రగడ తన బలాన్ని అతిగా అంచనా వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ముద్రగడ వైసీపీలో ఉండి పవన్ ను నేరుగా తిట్టడంతో.. ఆ సామాజికవర్గం ఎక్కడ తమకు దెబ్బకొడుతుందో అన్న భయం వైసీపీ కాపునేతల్లో వ్యక్తమవుతోంది.

సాక్షాత్తూ పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగాగీత సైతం ముద్రగడ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనమానాన తనప్రచారం, తన ఎత్తుగడలతో ముందుకెళ్తుంటే.. అనవసర వ్యాఖ్యలతో ఇబ్బందులు తెస్తున్నారని వాపోతున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు, కార్యకర్తలు మరింత పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే పవన్.. అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు తమకు ఇబ్బందులు తెస్తున్నాయంటున్నారు స్థానిక నేతలు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :