ASBL NSL Infratech

రివ్యూ : డెబ్యూ మూవీతో 'హీరో'గా అశోక్ గల్లా ఆకట్టుకున్నాడు

రివ్యూ : డెబ్యూ మూవీతో 'హీరో'గా అశోక్ గల్లా ఆకట్టుకున్నాడు

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5

బ్యానర్ : అమర రాజా

నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు

సంగీతం : జిబ్రాన్‌ ఎడిటర్ : ప్రవీణ్ పూడి సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సమర్పణ: ఘట్టమనేని కృష్ణ, గల్లా అరుణ కుమారి నిర్మాత : పద్మావతి గల్లా దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి

విడుదల తేదీ: 15.01.2022

సినిమా బ్యాక్ గ్రౌండ్ వున్న వారసులు టాలీవుడ్‌లోకి వస్తూనే వున్నారు వారిలో ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా గుర్తింపు పొందిన కొంత మంది హీరోలు, తమ వారసులను సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ కృష్ణ, ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ మనవడు, (కూతురు పద్మ తనయుడు) మహేశ్‌బాబు మేనల్లుడు, గల్లా అశోక్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘హీరో’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజు జనవరి 15న విడుదలైంది. ‘హీరో’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో అశోక్ గల్లా హీరో గా టాలీవుడ్ లో నిలబడతాడా? రివ్యూ లో చూద్దాం!

కథ:

మధ్యతరగతి కుటుంబానికి చెందిన అర్జున్‌(అశోక్‌) చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కలలు కంటారు. సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. అదే క్రమంలో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని పక్క ప్లాట్‌లోకి వచ్చిన పశువుల వైధ్యురాలు సుబ్బు అలియాస్‌ సుభద్ర (నిధి అగర్వాల్‌)తో ప్రేమలో పడతాడు. ఓ రోజు అర్జున్ కి ఒక అనుమానాస్పద పార్సిల్ వస్తుంది. అందులో అర్జున్ లవర్ అయినటువంటి సుబ్బు తండ్రి(జగపతిబాబు) ని చంపాలని ఉంటుంది. అందులో ఓ గన్‌ కూడా ఉంటుంది. అర్జున్ కి సంబంధం లేని ఓ క్రైమ్‌ కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ గన్‌ ఎక్కడ నుంచి వచ్చింది? క్రైమ్‌ కేసు నుంచి అర్జున్‌ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు తండ్రితో ఆ గన్‌కు ఉన్న సంబంధం ఏంటి? సుబ్బు ప్రేమను అర్జున్‌ ఎలా దక్కించుకున్నాడు? హీరో అవ్వాలనే అర్జున్‌ కోరిక నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు: మొదటగా నటీనటుల పెర్ఫామెన్స్ లు కోసం మాట్లాడుకున్నట్టయితే తన మొదటి సినిమాలో ఎలా చేసి ఉంటాడు అనే ప్రశ్నలకి అశోక్ గల్లా కి పాస్ మార్కులే పడ్డాయి. అర్జున్‌ పాత్రలో అశోక్‌ ఒదిగిపోయాడు, పాత్రకి తగ్గట్టుగా కావాల్సిన అన్ని కీలక సన్నివేశాల్లో తగిన ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లు మరియు డాన్స్ విషయాల్లో అశోక్ సూపర్బ్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే తన లుక్స్ పరంగా కూడా సినిమాలో బాగా కనిపించి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. తన డైలాగ్ డెలివరీ కానీ కామెడీ టైమింగ్ గాని సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. నిధి అగర్వాల్‌ మరోసారి తెరపై తనదైన అందాలతో అలరించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అశోక్‌ , నిధిల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇక హరో స్నేహితుడు, రాప్‌ సింగర్‌గా సత్య ‘వెన్నెల’ కిషోర్ ల ఎంటర్టైనింగ్ ట్రాక్స్ ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తాయి. తనదైన కామెడీతో నవ్వించారు. హీరోయిన్‌ తండ్రిగా జగపతి బాబు నటన ఆటకుంటుంది. చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. క్లైమాక్స్‌లో మాత్రం నవ్వించాడు. హీరో తండ్రిగా నరేశ్‌ తనదైన నటనతో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్‌ సలీమ్‌ భాయ్‌ పాత్రలో రవికిషన్‌ జీవించేశాడు. క్లైమాక్స్‌లో సినిమా హీరోగా బ్రహ్మజీ అయితే ఫుల్‌గా నవ్విస్తాడు. కోట శ్రీనివాసరావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు : శమంతకమణి, భలేమంచి రోజు, దేవదాస్‌ చిత్రాలలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీరామ్‌ ఆదిత్య.. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘హీరో’ని తెరకెక్కించాడు. ఓ కామెడీ కథకి ముంబై మాఫియా లింకులు కలిపి ఫన్‌ క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా తన స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. యంగ్ హీరో అశోక్ కి మంచి డెబ్యూ తన డైరెక్షన్ తో ఇచ్చాడని చెప్పాలి. కాకపోతే కొన్ని లాజిక్స్ మాత్రం మిస్సయ్యాడు అవి పక్కన పెడితే ఈ సినిమాకి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. అలాగే కంపోజర్ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అలాగే పాటల ఫ్లో కూడా కరెక్ట్ గా సెట్ చేశారు. అలాగే సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ ల సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఇంకా ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ లో డైలాగ్స్ బాగున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు.

విశ్లేషణ:

ఫస్టాఫ్‌ అంతా రోటీన్‌గా సాగినప్పటికీ.. ప్రేక్షకుడికి మాత్రం బోర్‌ కొట్టించకుండా కామెడీతో మెప్పించాడు దర్శకుడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథ రోటీన్‌ కామెడీతో సాగడం సినిమాకు కాస్త మైనస్‌. జగపతి బాబు ప్లాష్‌ బ్యాక్‌ ఓ రేంజ్‌లో ఉంటుందని ఊహించుకున్న ప్రేక్షకుడికి.. ఆయన్ని కామెడీ పీస్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కామెడీ పండించడంలో భాగంగానే జగపతిబాబుని అలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే.. అలాగే తన డెబ్యూ చిత్రానికి అశోక్ గల్లా పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి. ఇంకా తనని తాను మెరుగు పరుచుకునే అవకాశం ముందుంది దానికి ఈ హీరో వారధి. అలానే నిధి సహా మిగతా నటీనటులు పెర్ఫామెన్స్ లు కామెడీ ఎపిసోడ్ లు డెఫినెట్ గా ఆకట్టుకుంటాయి. కొన్ని లాజికల్ ఎర్రర్స్ ని పక్కన పెడితే ఈ పండుగకి ‘హీరో’ బాగానే ఎంటర్టైన్ చేస్తాడు.ఈ సినిమాకి నిర్మాణ విలువలు మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మొత్తంగా కొన్ని లాజిక్స్‌ని పక్కనపెట్టి చూస్తే ఈ సంక్రాంతికి ‘హీరో’ ఎంటర్‌టైన్‌ చేస్తాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :