ASBL NSL Infratech

రివ్యూ : రెండు సింహాల పోరాటం ‘భీమ్లా నాయక్’

రివ్యూ : రెండు సింహాల పోరాటం ‘భీమ్లా నాయక్’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5

బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్,

నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, రావు రమేష్, మురళీశర్మ తదితరులు నటించారు. సంగీత దర్శకుడు: తమన్.ఎస్ సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్ ఎడిటర్ : నవీన్ నూలి మాటలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం : సాగర్ కె చంద్ర

విడుదల తేదీ: 25.02.2022

టాలీవుడ్ లో హీరోలు ఎందరున్నా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు వున్నా ఫాల్లోవింగ్ వేరు... అతనికున్న స్టామినా ఏమిటో గత చిత్రాల సక్సెస్ లే నిదర్శనం! ప్రతి చిత్రం విభిన్నమైన కథలతో తన మాస్ యాక్షన్ తో గత 27 ఏళ్లుగా ప్రేక్షక లోకాన్ని అలరిస్తూ వస్తున్నారు. అయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే పండగ. గత ఏడాది 'వకీల్ సాబ్' గా బుల్లి స్క్రీన్ లపై రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు 'భీమ్లా నాయక్' గా బిగ్ స్క్రీన్స్ పై మన ముందుకొచ్చాడు. మలయాళం లో సెన్సషనల్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్ ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చేస్తున్నారన్న వార్త తెలియడంతో టాక్ అఫ్ ది మేటర్ అయ్యింది ఈ మూవీ. అయితే మాతృకలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆయన ‘భీమ్లా నాయక్’లో ఇన్ వాల్వ్ అయ్యారు. ఆయన మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో ఎలివేషన్ సాంగ్ కూడా రాశారు. వీటన్నిటికీ తోడు దగ్గుబాటి రానా ఈ చిత్రంలో మరో హీరోగా చేయడం చిత్రానికి హైప్ తీసుకొచ్చాయి. అయ్యారే! అప్పట్లో ఒకడుండేవాడు, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ప్రోమో, టీజర్, ట్రైలర్ సహా తమన్ అందించిన పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరి పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో ‘భీమ్లా నాయక్’తో ప్రేక్షకులను మెప్పించారా? లేదా? అని విషయం తెలియాలంటే కథేంటో చూద్దాం...

కథ:

కర్నూలు జిల్లా హఠకేశ్వర్ మండలంలో తెలంగాణ బోర్డర్‌లోని పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్). నిజాయతీ గల అధికారి. డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) మాజీ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు. తనొక రిటైర్డ్ మిలటరీ పర్సన్. తెలంగాణలోని నల్ల పట్ల ప్రాంతానికి వెళుతుంటాడు. ఓ రాత్రి ఆంధ్ర బోర్డర్ దాటడానికి కారులో అడవి గుండా ప్రయాణిస్తూ మద్యం తాగుతూ ప్రాణనిస్తుంటాడు. పరిమితికి మించిన మద్యం దొరకడంతో ఓ కారణమైతే, తాగిన మత్తులో డానియల్ శేఖర్ అక్కడున్న పోలీసులపై చేయి చేసుకుంటాడు. దాంతో డానియల్ శేఖర్‌ని భీమ్లా నాయక్ అరెస్ట్ చేస్తాడు. అతని పొగరు చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాడు. దాంతో డానియల్ శేఖర్ అహమ్ దెబ్బ తింటుంది. పోలీస్ స్టేషన్ లో అతను ప్లాన్ చేసిన భీమ్లా నాయక్‌ను ఓ కేసులో ఇరికిస్తాడు. భీమ్లా నాయక్ ఉద్యోగం పోతుంది. భీమ్లా నాయక్ ఆత్మ గౌరవం కోసం.. డానియల్ శేఖర్ అహంకారంతో ఒకరిపై ఒకరు యుద్ధం మొదలు పెడతారు. చివరకు ఆ ఘర్షణ ఇద్దరు ఒకరిని ఒకరు చంపుకుందామనుకునే వరకు వెళుతుంది. మరో వైపు డానియల్ తండ్రి, మాజీ పార్లమెంట్ మెంబర్(సముద్ర ఖని) రంగంలోకి దిగి.. భీమ్లా నాయక్ కుటుంబంపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. భీమ్లా నాయక్ తన ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. అప్పుడు డానియల్ శేఖర్‌కి భీమ్లా నాయక్ గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? చివరకు భీమ్లా నాయక్, డానియల్ గొడవలో ఎవరు గెలుస్తారు? నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ల పాత్ర లు ఏమిటన్నది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటి నటుల హావభావాలు:

భీమ్లా నాయక్ చిత్రం చుసిన తరువాత ఆ పాత్రలో మరే నటుడిని ఊహించలేము. పవన్ కళ్యాణ్ నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పవన్ ఫ్యాన్స్ కు భీమ్లా నాయక్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ విజువల్ ట్రీట్ ఇచ్చారు పవన్. తన పరిపక్వతమైన నటనతో పవన్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా అతని సంభాషణలు పలికే విధానం మాటకు మాట సమాధానం ఇవ్వడం లాంటివి బాగా ఆకట్టుకుంటాయి. క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. సహజంగా పవన్ కళ్యాణ్ తెర పై కనిపించే ప్రతి సన్నివేశం లో మిగతా నటులను పట్టించుకోవడం మానేస్తాం. దానికి భిన్నంగా ఈ చిత్రంలో రానా దగ్గుబాటి తన సంభాషణలతో నటనతో ఆకట్టుకున్నాడు. పవన్ కి పోటీగా ధీటుగా రానా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అతను చేసిన బాహుబలి భల్లాల పాత్రకంటే గొప్ప పాత్ర లభించిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో అలాంటి పేరొస్తుంది రానాకు. ఇక పవన్ కళ్యాణ్, రానా మధ్యలో వచ్చే పోరాట సన్నివేశాలు రెండు సింహాలు ఢీ కొట్టుకున్నట్లు ఇద్దరు నటించారు. ఇక హీరోయిన్స్ గా నటించిన నిత్యా మీనన్, సంయుక్త మీనన్ తమ నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. సి ఐ గా మురళి శర్మ, మాజీ ఏం పి గా సముద్ర ఖని, తమ పాత్రల మేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాకు ఆయువుపట్టు స్క్రీన్ ప్లే, రచయిత త్రివిక్రమ్ ఒక పాత్రకి మరో పాత్రకు మధ్య మంచి వైవిధ్యాన్ని చూపిస్తూ.. ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం బాగా ఆకట్టకుంది. మెయిన్ గా పవన్ రానా మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే మిగిలిన స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన మరియు భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ మెచ్చేలా ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకుంటూ వచ్చారు. పవర్ ఫుల్ డైలాగ్స్‌ను పవన్ పాత్రకు కథానుగుణంగా రాశారు. డైరెక్టర్ సాగర్ కె.చంద్ర టేకింగ్ బావుంది. నవీన్ నూలి ఎడిటింగ్‌ను కూడా అభినందించాల్సిందే. ఇక తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా రేంజ్‌ను పెంచాయి. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ:

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో, పవర్ ఫుల్ ఎమోషన్స్ తో పవన్ కళ్యాణ్ రానా బలమైన స్క్రీన్ ప్రెజన్సీతో ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంది. రెండు బలమైన పాత్రలు ఢీ కొట్టుకున్నప్పుడు వాటిలోని ఎమోషన్స్ తగ్గకుండా ఉండేలా.. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను మలచడంలో త్రివిక్రమ్ తన పెన్ పవర్ చూపించారు. అలాగే ‘నన్ను పీకేస్తే మళ్లీ మొలుస్తా.. నన్ను తొక్కేస్తే మళ్లీ లేస్తా.. కానీ తిరుగులేని యుద్ధాన్ని నీకు చూపిస్తాను’ అంటూ పవన్ పొలిటికల్ కోణాన్ని చూపించే డైలాగ్స్ కూడా ఇందులో మనకు వినిపిస్తాయి. మలయాళ మాతృక వ్యవధి మూడు గంటలు ఉంటే.. తెలుగులో మాత్రం రన్ టైమ్ రెండు గంటల ఇవరై ఐదు నిమిషాలే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో క్యారెక్టర్‌కు ఇచ్చిన బిల్డప్‌కు నెక్ట్స్ లెవల్‌కు ఎలివేట్ చేసేలా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. అలాగే క్లైమాక్స్‌ను ఈ ఫ్లాష్ బ్యాక్‌కి లింకు పెడుతూ ముగింపును ఓ ఎమోషనల్ కోణంలో ఇచ్చారు. అయితే, అక్కడక్కడ స్లోగా సాగే సీన్స్, కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ పవన్, రానా ల డాషింగ్ అండ్ డైనమిక్ పెర్ఫామెన్స్ లు బాగా అలరిస్తాయి. మొత్తానికి ఈ చిత్రం మల్టీ స్టారర్ చిత్రంగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి ఎమోషల్ యాక్షన్ ట్రీట్ లా అనిపిస్తోంది. ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ మూవీ నిలుస్తుంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :