Rasha Alawi :అమెరికా నుంచి లెబనీస్ డాక్టర్ బహిష్కరణ

రోడ్ ఐలాండ్‌లో కిడ్నీ మార్పిడి స్పెషలిస్టుగా పని చేస్తున్న లెబనీస్ డాక్టర్ రాషా అలవీ (Rasha Alawi)కి ఉగ్రసంస్థ హెజ్‌బొల్లా (Hezbollah)తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అమెరికా తమ దేశం నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బై బై చెప్తున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ బైబై రాషా అంటూ రాసుకొచ్చింది. గతవారం బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాషాను అమెరికా అధికారులు అదుపుతోకి తీసుకున్నారు. ఇటీవల లెబనాన్ (Lebanon) పర్యటనకు వెళ్లి రాషా ఫిబ్రవరి 23న జరిగిన హెజ్‌బొల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా (64) అంత్యక్రియలకు హాజరైనట్లు దర్యాప్తులో అంగీకరించారని వారు తెలిపారు. అంతేకాకుండా ఆమె ఫోన్‌లో నస్రల్లా, ఇతర హెజ్‌బొల్లా నేతల ఫొటోలు ఉన్నాయని, కాగా బోస్టన్ (Boston ) చేరుకునే ముందు రాషా వాటిని తొలగించారని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా వారి రాజకీయ కార్యకలాపాల గురించి కాకుండా, మతపరమైన ఆధ్యాత్మిక బోధనల విషయంలో తాను హెజ్‌బొల్లా నేతలను అనుసరిస్తానని పేర్కొన్నట్లు తెలిపారు. తీవ్రవాద సంబంధాలు ఉన్న వీసాదారులపై విస్తృత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆమెకు హెజ్‌బొల్లాతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో దేశం నుంచి బహిష్కరించినట్లు వెల్లడిరచారు. అయితే హఠాత్తుగా ఆమెను దేశం నుంచి బహిష్కరించడంపై చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని రాషా తరపు న్యాయవాది పేర్కొన్నారు.