Trump: ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు.. మిస్సింగ్ వార్తలపై చర్చలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) పూర్తి ఆరోగ్యంతో ఉన్నారా..? ఎందుకంటే ట్రంప్ లో సాదారణంగా ఈజ్ ఉంటుంది. తన నడక, మాటతీరు, హావభావాలు అన్నీ .. ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి కూడా. అలాంటి ట్రంప్.. ఇప్పుడు .. బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ‘మిస్సింగ్’ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. వారాంతంలో కూడా ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్‌హౌస్ షెడ్యూల్‌లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడం చర్చకు దారితీసింది. ‘‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.
ఇక 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.