ఆయన అతి బలహీనమైన అధ్యక్షుడు : చైనా
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాదకారి అని చైనా అభిప్రాయపడుతోంది. ఆయనతో తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. బైడెన్ బలహీనమైన వ్యక్తి అని, లోపాలను కప్పిపుచ్చుకోవడానికి తమపైకి యుద్ధానికి రావచ్చని అంచనా వేస్తోంది. చైనా ప్రభుత్వ సలహాదారు, షెంజెన్ లోని అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెపరరీ చైనా స్టడీస్ సంస్థలో డీన్‌గా పనిచేస్తున్న జెంగ్ యోంగ్నియన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మధురమైన ఆ పాతరోజులు వెళ్లి పోయాయి. అమెరికాలో ప్రచ్చన్న యుద్ధం నెలకొంది. అది ఎన్నో ఏళ్లు కొనసాగుతుంది. అమెరికా సమాజం ముక్కలయింది. ఈ సమస్యను బైడెన్ పరిష్కరిస్తారని అనుకోవడం లేదు. ఆయన అతి బలహీనమైన అధ్యక్షుడు. అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే దౌత్యరంగంపై దృష్టి మళ్లిస్తారు. చైనాకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు వ్యతిరేకి అయినా యుద్ధంపై మాత్రం ఆసిక్తి చూపేవారు కాదు. కానీ బైడెన్ యుద్దాని మొదలు పెట్టగలరు. రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అమెరికాతో అనుబంధం పెంచుకోవడానికి దొరికిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి అని చెప్పారు.






