J.D. Vance: త్వరలో భారత పర్యటనకు జేడీ వాన్స్ దంపతులు!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. తన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి (Usha Chilukuri)తో కలిసి ఆయన ఈ నెలాఖరులో భారత్ (India) కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాన్స్ చేపడుతున్న రెండో విదేశీ పర్యటన ఇదే కానుంది. గత నెల ఆయన ఫ్రాన్స్(France) , జర్మనీ (Germany) దేశాలకు వెళ్లారు. తెలుగు మూలాలున్న ఉష అమెరికా రెండో మహిళ హోదాలో తన పూర్వీకుల దేశానికి రానుండటం ఇదే తొలిసారి. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970ల్లో అగ్రరాజ్యానికి వలస వెళ్లారు. ఉష అమెరికాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగారు. యేల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారడంతో 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.