Iran: ఇరాన్‌కు అమెరికా భారీ ఆఫర్

ఇరాన్ (Iran) అణుకేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులు వేసిన అమెరికా (America) ఇప్పుడు ఆ దేశాన్ని అణుచర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెహ్రాన్ (Tehran)కు 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్లు) సాయం చేస్తామంటోంది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నెల 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేయడంతో అమెరికా-ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న అణుచర్చలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా కూడా మూడు అణుస్థావరాలపై దాడి చేయడంతో ఇప్పుడు చర్చలకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ను ఒప్పించేందుకు వివిధ ప్రతిపాదనలను ట్రంప్ యంత్రాంగం తెరపైకి తీసుకొస్తోంది. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను సడలించే అంశాల్నీ పరిశీలిస్తోంది. గతంలో వివిధ వివిధ విదేశీ బ్యాంకుల్లో ఆ దేశానికి సంబంధించిన ఆరు బిలియన్ డాలర్లను అమెరికా జప్తు చేసింది. వాటిని వినియోగించుకొనే అవకాశం టెహ్రాన్‌కు కల్పించాలని అగ్రరాజ్యం భావిస్తోంది.