Green Card: గ్రీన్‌కార్డు, హెచ్-1బీ పై ఉన్న భారతీయులు అలర్ట్

గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదు అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) ఇటీవల చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది వలసదారుల్లో, ముఖ్యంగా భారత సంతతి వారిలో గుబులు రేపుతున్నాయి. దీనికి అనుగుణంగానే గత కొన్ని వారాలుగా అమెరికా తన వలస చట్టాలను మరింత కఠినతరం చేయడం వలసదారుల ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల యూఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు.
హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. వీరు అమెరికాలో ప్రవేశించే, నిష్మ్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ (Trump) సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలసదారుల ప్రయాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ (India) ఈ ఆంక్షల జాబితాలో లేనప్పటికీ, అమెరికా వెలుపల ప్రయాణాలు చేయాలనుకునే భారతీయులు (Indians) అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.